మావోయిస్టుల దాడిలో బిజెపి ఎమ్మెల్యే మృతి

సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టులు పంజా విసిరారు. చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోలు జరిపిన దాడిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దంతెవాడకు ప్రచారానికి వెళ్తున్న బిజెపి ఎమ్మెల్యే వాహన శ్రేణిపై పేలుడు పదార్థాలు విసిరారు. ఈఘటనలో మాండవితో పాటు మరో ఐదుమంది అక్కడికక్కడే మృతి చెందగా కాన్వాయ్‌లో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. 

ఎమ్మెల్యే కాన్వాయ్‌ను టార్గెట్‌ చేసిన మావోయిస్టులు తొలుత ఆయన వాహనాన్ని మందుపాతరతో పేల్చారు. అనంతరం కాల్పులకు తెగబడ్డారు.  చత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11, ఏప్రిల్‌ 18, 23 తేదీల్లో పోలింగ్ జరగనుంది.