16 సీట్లతో కేసీఆర్‌ ప్రధాని అవుతారా?

ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. 16 స్థానాల్లో తమను గెలిపించాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కేసీఆర్‌ దేశ ప్రధాని కాగలుగుతారా?అని ప్రశ్నించారు.

శంషాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొంటూ దేశం మొత్తం మోదీ నామస్మరణ వినిపిస్తోందని, మోదీయే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.

‘‘తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. హైదరాబాద్‌ మెట్రో కోసం కేంద్రం రూ.1600 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్‌కు బయో డైవర్సిటీ వంటి కేంద్ర సంస్థలను మంజూరు చేసింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేశాం" అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ అభివృద్ధి కోసం సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఏం ఇచ్చారో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని సవాల్ చేసారు. తెలంగాణ విమోచన దినం జరిపే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీకి సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని దుయ్యబట్టారు. మంచి మెజార్టీతో గెలిచి కూడా రెండు నెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారని ఎద్దేవాచేశారు.

‘‘పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దేశానికి ఏమీ చేయలేకపోయింది. మాల్యావంటి వారు కాంగ్రెస్‌ హయాంలోనే భారీగా బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఉగ్రవాదులు ఘాతుకానికి 40 మంది సైనికులు చనిపోతే, పాకిస్థాన్‌ను సమర్థించేలా మాట్లాడారు. దేశం మొత్తం గర్విస్తున్న సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా తక్కువ చేసి మాట్లాడారు" అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ కోరుతోందని చెబుతూ కాంగ్రెస్‌ మిత్రపక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ డిమాండ్‌ను రాహుల్‌ గాంధీ సమర్థిస్తారా? అని రాహుల్‌ను అమిత్‌షా ప్రశ్నించారు.