ప్రైవేటు లిమిటెడ్ పార్టీలుగా టీఆర్‌ఎస్, టీడీపీ


టీఆర్‌ఎస్, టీడీపీలతో పాటు మరికొన్ని పార్టీలు దేశంలో ప్రైవేటు లిమిటెడ్ పార్టీలుగా మారాయని దాంతో కుటుంబపాలనకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజల అభీష్టాలను తుంగలో తొక్కుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని దేవరకద్రలో నిర్వహించిన విజయసంకల్ప బహిరంగసభలో రామ్‌మాధవ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ఈ ఎన్నికలు దేశ ప్రధాన మంత్రిగా ఎవరు ఉండాలనే ఎన్నిక అని తెలిపారు. 

మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీని చేయాలని ఇప్పటికే దేశంలోని కోట్లాది మంది ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఎన్‌డిఎ ప్రభుత్వం మళ్లీ దేశాన్ని పరిపాలించనుందని ఆయన స్పష్టం చేశారు.  సామాన్య ప్రజల స్థితిగతులు తెలిసిన మహోన్నతమైన నాయకుడు నరేంద్రమోదీ అని పేర్కొన్నారు. ఇల్లు లేకుండా దేశంలో ఎవరు కూడా ఉండకూడదని, ఇళ్లు లేని 5కోట్ల మందికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో మోదీ ముందుకు వెళ్తున్నారని చెబుతూ  అందులో భాగంగా 1.50కోట్ల ఇళ్లను ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్మించి ఇచ్చామని తెలిపారు. 

బీజేపీ మాటల పార్టీ కాదని చేతల పార్టీ స్పష్టం చేశారు. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంటూ దేశం విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. మోదీ దృష్టి అంతా సామాన్య ప్రజలపై ఉందని అందుకే ఆరోగ్య బీమా పథకాన్ని ఆమలుల్లోకి తీసుకోచ్చారని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఆమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ప్రతి మనిషి జీవితంలో గౌరవంగా ఉండాలని భావిస్తుంటారని ఆ గౌరవాన్ని నిలబెట్టడానికే ఆరోగ్య బీమా పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. 

గత ఐదేళ్లలో నరేంద్రమోదీ పాలనలో దేశంలో స్కాంలు లేవని, స్కీంల గురించే మాట్లాడుకోవల్సి వస్తుందని రామ్‌మాధవ్ పేర్కొన్నారు. గతంలో పరిపాలించిన వారి పాలనలో స్కాంల గురించి చర్చించుకునే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ తీవ్రవాదులు గత పాలకుల హయాంలో దేశంలోని హైదరాబాద్, ముంబాయి, తదితర ప్రాంతాలతో పాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా బాంబులు వేసి తమ ఉనికిని చాటుకునేవారని దుయ్యబట్టారు. అలాంటివారిని అణగదొక్కడానికి గట్టి నిర్ణయాలు తీసుకునేవారు కాదని విమర్శించారు. 

నరేంద్రమోది ప్రధానమంత్రి అయ్యాక తీవ్రవాద కార్యకలాపాలను దేశంలో కట్టడి చేయడమే కాకుండా తీవ్రవాదులను ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణచివేయడం జరుగుతుందని చెప్పారు. నరేంద్రమోది బలమైన నాయకుడు కాబట్టే దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి తీవ్రవాదుల శిబిరాలను కూల్చివేస్తున్నారంటే సైనికులకు నరేంద్రమోదీ ఇచ్చిన స్వేచ్ఛ అని తెలిపారు. నరేంద్రమోదీ పేరు వింటేనే ప్రపంచంలోని టెర్రరిస్టులంతా వణికిపోతున్నారని వివరించారు. 

అలాంటి నాయకుడు దేశానికి ప్రధాని కావాలని భారతీయులంతా కోరుకుంటున్నారని రామ్‌మాధవ్ తెలిపారు. కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్‌కు అవకాశమే ఉండదని చెబుతూ  ఆయన కింగ్‌మేకర్ అవుతున్నారని చెప్పడం ఓ జోక్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశానికి ఓ కింగ్ ఉన్నాడని అది నరేంద్రమోది అని స్పష్టం చేశారు. బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల అవసరాలను తీర్చేదని అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకునే మ్యానిఫెస్టో ని పేర్కొన్నారు. 

స్వార్థపరులు, అవినీతిపరులు కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశఅస్థిత్వానికి ముప్పు అని హెచ్చరించారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని ఆయన కోరారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న డీకే అరుణను పార్లమెంట్‌కు పంపిస్తే నరేంద్రమోదీ ఆశీస్సులు ఆమెకు తప్పకుండా ఉంటూ పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం పెద్దపీఠ వేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 

టీఆర్‌ఎస్ లాంటి ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలకు ఓటువేస్తే వృథా కాగలదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలతోనే తెలంగాణలో మార్పుకు తొలిమెట్టుగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.