విమానంలో బిజెపి వ్యతిరేక నినాదాలు.. అరెస్ట్

తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ప్రయాణిస్తున్న విమానంలో ఆమె ఎదుటనే బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ట్యూటికోరిన్‌ ఎయిర్‌పోర్టులో జరిగింది.

కెనడాలో ఇండియన్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన లూయిస్‌ సోఫియా(28), సౌందరరాజన్‌లు ఇద్దరూ ఒకే విమానంలో ట్యూటికోరిన్‌కు వస్తున్నారు. సౌందరరాజన్‌, సోఫియా ముందు సీట్లో కూర్చున్నారు. సోఫియా అకస్మాత్తుగా ‘డౌన్‌ విత్‌ మోదీ-బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్ట్‌  గవర్నమెంట్‌’ అంటూ బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు.

దీంతో సౌందరరాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విమానం ట్యూటికోరిన్‌లో ల్యాండ్‌ కాగానే సోఫియాను అరెస్ట్‌ చేశారు. ఒక విమానంలో ప్రయాణించేటపుడు ఆ విధంగా అరుస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయవచ్చా? ఇది పబ్లిక్‌ ఫోరం కాద’ని సౌందరరాజన్‌  ప్రశ్నించారు. దీని వెనక తీవ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసారు.

ఆమె ఒక సాధారణ ప్రయాణికురాలిగా కనిపించడం లేదని, తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తం చేసారు. పబ్లిక్‌ న్యూసెన్స్‌ కింద సోఫియాపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే లోకల్‌ కోర్టు ఆమెకు 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.