రోజుకు 10 లక్షల ఫేస్‌బుక్ ఖాతాల తొలగింపు

లోక్‌సభ ఎన్నికల వేళ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడాన్ని అడ్డుకునేందుకు ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. రోజుకు సుమారు 10 లక్షల ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగిస్తోంది. ఫేస్‌బుక్‌ ఇండియా ఎమ్‌డీ, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్  ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో ఈ వివరాలు తెలిపారు.

భారత దేశం 17వ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోందని, ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్న ఫేస్‌బుక్‌ ఖాతాలను కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి నిలిపేయడం కానీ, తొలగించడం కానీ చేస్తున్నామని పేర్కొన్నారు. గత 18 నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ బృందాలు భారత దేశ ఎన్నికలు సజావుగా జరిగేందుకు దోహదపడేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

దీనివల్ల బూటకపు ఖాతాలను నిలిపేయడం, తొలగించడం సహా ముఖ్యమైన చర్యలపై దృష్టి సారించామని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడంపై పోరాటం, స్థానికులు దుర్వినియోగం చేయడాన్ని నిలిపేయడం, విదేశీ శక్తుల ప్రయత్నాలను గుర్తించడం, సమన్వయంతో కూడిన నిజాయితీ లేని ప్రచారాలను నిరోధించడం వంటివాటిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

దేశ, విదేశాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, ఎటువంటి ఇతర జోక్యాలు లేకుండా జరిగేవిధంగా ఫేస్‌బుక్, దాని యాప్‌లు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.  సింగపూర్, డబ్లిన్‌లలో ఎన్నికల దృష్ట్యా కొత్త రీజనల్ ఆపరేషన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఢిల్లీలోని నిపుణులతో ఈ బృందాలు పని చేస్తాయని, వీరంతా కలిసి కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంతో సమన్వయం చేసకుని పని చేస్తాయని వివరించారు. 

తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం, విద్వేషపూరిత ప్రసంగాలు, ఓటర్ల హక్కుల అణచివేత వంటివాటిని నిరోధించేందుకు రక్షణగా మరొక అంచె భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. తాము తీసుకున్న చర్యల ద్వారా ఫేస్‌బుక్ గ్లోబల్ కోఆర్డినేషన్‌ బలోపేతమవుతుందని, ఫేస్‌బుక్ రెస్పాన్స్ టైమ్ మరింత పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ స్వయంగా అనువదించే వ్యవస్థలో 24 కొత్త భాషలను చేర్చింది. వీటిలో 16 భారతీయ భాషలు ఉన్నాయి.