మళ్లీ ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు

దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బంగారం కొనుగోళ్లకు దిగింది. గత ఆర్థిక సంవత్సరం (2017-18) 8.46 టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆర్బీఐ వద్దనున్న పుత్తడి నిల్వలు 566.23 టన్నులకు పెరిగాయి.

నిరుడు జూన్ 30 కల్లా 557.77 టన్నులుగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కాలంలో 8.46 టన్నులు కొన్నైట్లెంది. ఈ మేరకు 2017-18కిగాను ఇటీవల విడుదల చేసిన తమ వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొన్నది. చివరిసారిగా 2009 నవంబర్‌లో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొన్నది. నాడు ఏకంగా 200 టన్నుల పసిడిని తమ ఖాతాలో వేసుకున్నది.

ఇక ఇప్పుడున్న 566.23 టన్నుల బంగారు నిల్వల్లో 292.30 టన్నులను కరెన్సీ నోట్ల కోసం దన్నుగా ఆర్బీఐ ఆస్తిలా చూస్తుంటే, మిగతా 273.93 టన్నులను బ్యాంకింగ్ శాఖ ఆస్తిగా పరిగణిస్తున్నారు. బ్యాంకింగ్ శాఖ పరిధిలోని బంగారు నిల్వల విలువ 11.12 శాతం పెరుగగా, జూన్ 30తో ముగిసిన ఏడాది కాలంలో రూ.62,702 కోట్ల నుంచి రూ.69,674 కోట్లకు ఎగిసింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణతే ఈ పెరుగుదలకు కారణంగా ఆర్బీఐ స్పష్టం చేసింది.

కాగ, ఆర్బీఐ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించి మంగళవారం నాటికి రెండేండ్లు పూర్తయింది. 2016 సెప్టెంబర్ 4న పటేల్ 24వ గవర్నర్‌గా వచ్చారు. రఘురామ్ రాజన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. రాజన్ హయాంలో పటేల్ డిప్యూటీ గవర్నర్‌గా కూడా పనిచేశారు.