రాహుల్‌ను అధికారంలోకి రానివ్వం

ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీని ఆయన తప్పుబట్టారు. దేశద్రోహులకు మద్దతునిస్తున్న రాహుల్‌ను అధికారంలోని రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. 

మహారాష్ట్రలో  జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి,  శివసేన, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఏకతాటిపైకి వచ్చాయని తెలిపారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు తీవ్ర విభేదాలున్న పార్టీలు సైతం అధికార దాహంతో ఏకమయ్యాయని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తరఫున నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించామని.. మరి ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్ చేశారు. 

కాంగ్రెస్‌ రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తాననడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్దవ్‌ ఠాక్రే.. దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.  ద్రోహుల మద్దతుతో అధికారంలోకి రావాలని రాహుల్‌ భావిస్తే.. బిజెపి -శివసేన కూటమి అలా జరగనివ్వదని హెచ్చరించారు.

48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో 23 సీట్లలో శివసేన పోటీ చేస్తుండగా.. 25 స్థానాల్లో బిజెపి బరిలోకి దిగనుంది.