ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ ... బిజెపి నినాదం

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరొక్కసారి మోదీ సర్కార్) పేరుతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార నినాదాన్ని, ప్రచార గీతాన్ని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఆవిష్కరించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై టెలివిజన్ ప్రచారాన్నీ ప్రారంభించారు.

గత ఐదేండ్లలో మోదీ సర్కార్ ప్రగతిని, ఘన విజయాల్ని ప్రచార గీతంలో చేర్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం, తాజాగా గగనతలంలో చేపట్టిన ఏ-శాట్ పరీక్ష, వన్ ర్యాంక్-వన్ పెన్షన్ పథకం, పాక్‌పై ఇటీవలి మెరుపుదాడులు.. తదితర కీలక అంశాల్ని ఇందులో పొందుపర్చారు. 

దేశవ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో మొబైల్ వాహనాల్లో వీటిని ప్రదర్శిస్తారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేది మా ఎన్నికల నినాదం అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. సోషల్ మీడియా, హోర్డింగులు, రేడియోల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. 

స్థిరమైన, విజయవంతమైన పాలనను అందించిన ప్రధాని మోదీని ఎన్నుకుంటారా.. లేక గందరగోళ, మహాకల్తీ విపక్షాన్ని ఎన్నుకుంటారా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా జైట్లీ  తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించడానికి కెప్టెన్‌తో కూడిన 11 మంది టీమ్ కావాలో.. 40 మంది కెప్టెన్లు ఉన్న విపక్షాలు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. 

పేదలు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నామని, కానీ కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మధ్యతరగతి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని విమర్శించారు.