రాజన్ విధానాలతోనే ఆర్ధిక దుస్థితి !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఆవలంభించిన విధానాల కారణంగానే దేశం ఆర్ధికంగా దుస్థితి ఎదుర్కొంటున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేసారు. దేశంలో ఆర్ధిక వృద్ది మండగించడానికి పెద్ద నోట్ల రద్దు కారణమని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా త్రోసిపుచ్చారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల పట్ల రాజన్ అనుసరించిన విధానాల కారణంగా దేశ జిడిపి వృద్ది రేట్ స్తంభించి పోయినదని విమర్శించారు.

2016 నవంబర్ 8న పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసినప్పటి తర్వాత నుంచి విడుదలైన జీడీపీ గణాంకాలు క్రమేణా తగ్గుముఖం పట్టిన సంగతీ విదితమే. రాజన్ విధానాలతో బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు పెరిగాయని, దీని ప్రభావం జీడీపీపై పడిందని ఆయన తెలిపారు. అది నోట్ల రద్దు తర్వాతి కాలంలో తీవ్రతరమైందని చెప్పుకొచ్చారు.

నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థలో అప్పటికే మందగమనం మొదలైందన్న ఆయన దీన్ని నోట్ల రద్దుకు ఆపాదిస్తున్నారని పేర్కొన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) నుంచే జీడీపి పతనం మొదలైందని, ఇది వరుసగా ఆరు త్రైమాసికాలపాటు కొనసాగిందని గుర్తుచేశారు. గతేడాది మధ్యమం నాటికి భారతీయ బ్యాంకుల మొండి బకాయిలు రూ.10.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు కేవలం రూ.4 లక్షల కోట్లేనని చెప్పారు.  

ఇవి ఇంతలా పెరుగడానికి కారణం ఎన్‌పీఏల గుర్తింపునకు సంబంధించి అప్పటిదాకా అమల్లో ఉన్న విధానాన్ని రాజన్ సవరించడమేనని, దీనివల్ల బ్యాంకులు పరిశ్రమకు రుణాలు ఇవ్వడం ఆపేశాయని, ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థే మందగమనంలోకి జారుకున్నదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్యాంకుల రుణ వృద్ధిరేటు 1 లేదా 2 శాతానికే పరిమితమైందని, కొన్ని త్రైమాసికాల్లో ప్రతికూల స్థాయికీ వెళ్లిందని తెలిపారు.

కాబట్టి అప్పటి రాజన్ విధానాల ఫలితాల్ని ఇప్పుడు ప్రభుత్వం అనుభవించాల్సి వస్తున్నదని మండిపడ్డారు. 2017 జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతంగా ఉన్న జీడీపీ నోట్ల రద్దు నేపథ్యంలో అదే ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మూడేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 5.7 శాతానికి పతనమైన విషయం తెలిసిందే.