చంద్రబాబులో ఓటమి భయం... మంత్రులంతా డౌట్ !

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఓటమి భయం వెంటాడుతున్నదా ? అనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో చేసిన పనులు చెప్పి ఓట్లు అడగలేక ఎన్నికల ముందే పలు నూతన పధకాలు ప్రవేశ పెట్టి వాటినే ప్రచారం చేసుకొంటూ వస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా సరికొత్త హామీల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని హామీలకైతే తలాతోకా ఉండటం లేదు. 

ఒక సభలో ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇస్తున్న నిరుద్యోగ భృతిని ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి కూడా ఇస్తానని చెప్పడం ఉన్నత అధికారులకే విస్మయం కలిగించింది. అంటే ఇంటర్ తో చదువు ఆపివేయాలని విద్యార్థులను ప్రోత్సహిస్తారా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ తర్వాత ఆ మాట ఎత్తడం మానివేశారు. తాజాగా ముస్లింలు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం కాపు, బిసి లేకున్నా డిప్యూటీ సీఎం పదవిని ఎవ్వరికీ నిరాకరిస్తారు ?

ఇలా ఉండగా, చంద్రబాబు మంత్రివర్గంలోని వారంతా దాదాపుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉండగా వారు అడ్డదిడ్డంగా పాల్పడిన అవినీతి కారణంగా సొంత పార్టీ వారే వారికి ముఖం చాటేసే ప్రమాదం కనబడుతున్నది. ఎన్నికల ముందే  మంత్రులు, పార్టీ ఎమ్యెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, కనీసం 40 శాతం మందిని మార్చనిదే తిరిగి అధికారంలోకి రావడం కష్టమని టిడిపి ఎంపీ జేసీ దివాకరరెడ్డి హెచ్చరించగడం తెలిసిందే. 

ఇప్పుడా ప్రమాదాన్ని చంద్రబాబు గుర్తించిన్నట్లున్నారు. అందుకనే తాజాగా "నన్ను చూసి వోట్ వేయండి" అని అడగటం ప్రారంభించారు. అభ్యర్థులను చూసి కాకుండా  తనను వోట్ వేయమని బేలగా అభ్యర్ధించడం చేస్తున్నారు. ఆయన మంత్రివర్గంలో ఆయన తప్ప మరెవ్వరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

‘‘రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నన్నే అభ్యర్థిగా భావించండి. నన్ను చూసి ఓటెయ్యండి! తెలుగుదేశాన్ని గెలిపించండి’’ అని  కోరుతున్నారు.  ‘ప్రస్తుత పరిస్థితుల్లో స్థానికంగా ఉండే చిన్న సమస్యలను పట్టించుకోవద్దు. భవిష్యత్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేలా నేను చూస్తా’ అని హామీ ఇస్తున్నారు. అంటే ఇప్పుడున్నవారి పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.