శపథ్ పాత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో రేపే

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సోమవారం విడుదల కానుంది. తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘శపథ్ పాత్ర’ పేరుతో విడుదలకానున్న పార్టీ ఎన్నికల వాగ్దాన డాక్యుమెంట్‌లో  ‘అభివృద్ధి, జాతీయతావాదం, హిందుత్వ’కు పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. 

సోమవారం బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో  ‘శపథ్ పాత్ర’లో కేవలం హామీలే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు ఇతర ప్రత్యేకతలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెబుతున్నారు. 

2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో హామీ ఇవ్వని ‘ముద్ర’, ‘ఉజ్వల’ వంటి ఎన్నో పథకాలను బీజేపీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి మేనిఫెస్టోలో  అలాంటి పథకాలు కూడా ఉండబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘పటిష్ట భారతం, సమర్థ భారతం’ అనేది ఈసారి బీజేపీ ఎన్నికల స్లోగన్‌గా ఉండబోతోంది.

కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకాన్ని తన మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలోఎ విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో ఉపాధి కల్పనకు సంబంధించిన వివరాలు, గత ఐదేళ్లలో ఉపాధి కల్పన దిశగా తీసుకున్న చర్యలను కూడా  పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. 2022 నాటికి రైతుల హామీలు రెట్టింపు చేయడం, ఉగ్రవాదంపై కఠిన చర్యల కొనసాగింపులు వంటివి మేనిఫెస్టోలో ఇతర కీలకాంశాలు కానున్నాయి. 

అయోధ్యలో ఆలయ నిర్మాణం అనేది బీజేపీకి  కీలక ప్రధాన అంశం కావడంతో ఈసారి ఆ హామీని కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనుందని సమాచారం. అలాగే అయోధ్య, కాశీ, మధురకు ప్రత్యేక కారిడార్లు, గంగానది సహా పలు నదుల ప్రక్షాళన వంటివి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ఈనెల 7వ తేదీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల ఉంటుందనే ప్రచారం తొలుత జరిగింది.అయితే 8వ తేదీ ముహూర్తం బాగుండటంతో ఆ తేదీనే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్  తదితరులు పాల్గోనున్నారు.