ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చంద్రబాబు ఇరకాటం!

బావమరిది నందమూరి హరికృష్ణ మరణంతో ఖాళీ అయిన టీడీపీ పొలిట్‌బ్యూరో పదవిని భర్తీ చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. హరికృష్ణ వారసుల్లో కల్యాణ్‌రామ్‌కు లేదా జూనియర్ ఎన్‌టీఆర్‌లలో ఒకరికి ఆ పదవి ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పెద్ద కొడుకు కల్యాణ్‌రామ్‌కు పొలిట్‌బ్యూరో పదవి ఇవ్వడం సమంజసమే అయినా జనంలో బాగా క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే అల్లుడు నారా లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడంతో మంత్రివర్గంలో చేరలేక పోయిన హరికృష్ణ సోదరుడు నందమూరి బాలకృష్ణ సహితం ఆ పదవిపై కన్ను వేసిన్నట్లు చెబుతున్నారు. తెలుగు దేశం ప్రారంభం నుండి తండ్రి ఎన్ టి ఆర్ చైతన్య రధ సారధిగా పార్టీలో అందరితో మంచి సంబంధాలు ఉండడమే కాకుండా, మంచి మనిషిగా అందరిలో హరికృష్ణ పట్ల సానుభూతి కుడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, పార్టీలో ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కకు నెట్టి వేసినా రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సందర్భంగా అన్ని పార్టీల వారి నుండి సానుభూతి వ్యక్తం కావడం చంద్రబాబునాయుడును సహితం విస్మయ పరిచిన్నట్లు చెబుతున్నారు.

ఒక విధంగా చంద్రబాబునాయుడు నేడు ముఖ్యమంత్రిగా, టిడిపి సారధిగా ఉండటం కోసం తండ్రిపైననే తిరుగుబాటు జరిపిన హరికృష్ణ సాహసమే కారణంగా పలువురు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎప్పుడు తెరవెనుక రాజకీయాలు చేయడం మినహా ముందుండి పోరాడిన ఉదంతాలే లేవు. తెలుగు యువత అద్యక్షుడిగా పార్టీ వ్యవహారాలలో లక్ష్మీపార్వతి జోక్యాన్ని నిరసిస్తూ రాష్ట్రం అంతా తిరుగుతూ నిరసన గళం విప్పారు. ఆ తర్వాత కొన్ని నెలలకే మామగారిని గద్దె దించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు. 

ఈ సందర్భంగా తొలుత ఆరు నెలల పాటు హరికృష్ణకు మంత్రివర్గంలో చోటు కల్పించినా ఆ తర్వాత పక్కకు నెట్టేశారు. దానితో అన్న తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసి బావగారి మీదనే తిరుగుబాటు ఎగురవేశారు. కాని ఆ సమయంలో వాజపేయి ప్రభంజనంలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్టీ వర్గాలలో నెలకొన్న అసమ్మతి నుండి చంద్రబాబు బైటపడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

అయితే అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి ఎన్ టి ఆర్ ను ప్రచార అస్త్రంగా చేసుకోవడం కోసం హరికృష్ణను రాజ్యసభకు పంపడం, పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడం చేసారు. పైగా 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల  ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ఉండగా ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

కాని ఆ తర్వాత కొడుకు నారా లోకేష్ కు పార్టీలో పెత్తనం కలిగించడం కోసం ప్రజలలో, పార్టీ కార్యకర్తలలో మంచి క్రేజ్ గల జూనియర్ ఎన్టీఆర్ ఉండే అడ్డు కాగలరని ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. బాలకృష్ణ కుమార్తెతో లోకేష్ వివాహం జరిపిన తర్వాత బాలకృష్ణ, చంద్రబాబునాయుడు – ఇద్దరు కలసి సినిమా రంగంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రాబల్యం తగ్గించే ప్రయత్నం చేసారు. అతని సినిమాలకు దియేటర్లు దొరకకుండా ప్రయత్నించడమే కాకుండా వారి కుటుంభ ఆర్ధిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేసారు. అప్పటి నుండి హరికృష్ణ – బాలకృష్ణ కుటుంభాల మధ్య కుడా దూరం పెరిగింది.

ఆ తర్వాత అన్నగారి మరణం సందర్భం గానే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో బాలకృష్ణ మాటలు కలపటం జరిగింది. బాబాయ్ అబ్బాయిల ఆత్మీయ కలయిక ఇప్పటికే నందమూరి అభిమానులలో ఉత్తేజం కలిగిస్తున్నది. ఎన్టీఆర్ తాజా చిత్రం `అరవింద సమేత’ ఆడియో విడుదలకు బాలకృష్ణ రాబోతున్నరనే ఉహాగానాలు సిని వర్గాలలోనే కాకుండా రాజకీయ వర్గాలలో సహితం సంచలనం కలిగిస్తున్నాయి.

చాలాకాలంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ లతో బాలకృష్ణ వేదిక పంచుకోవడం లేదు. పైగా హరికృష్ణ మృతి సందర్భంగా కలసి భోజనం చేస్తున్న ఆ సోదరుల ఇద్దరి వద్దకు బాలకృష్ణ స్వయంగా వెళ్లి ఆప్యాయంగా పలకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ వలే వ్యాపిస్తున్నది.

ఎన్డియే నుండి బయటకు వచ్చిన తర్వాత టిడిపి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండటం, లోకేష్ ప్రభుత్వంలో – పార్టీలో చక్రం తిప్పుతున్నా ప్రజల ముందు, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అక్కరకు వచ్చేటట్లు కనిపించక పోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికలలో ప్రచారానికి దింపాలని టిడిపి వర్గాల నుండి వత్తిడి పెరుగుతున్నది.

గత ఎన్నికలలో టిడిపికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. హరికృష్ణ అంత్యక్రియల్లోనూ భౌతికకాయంపై చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను కప్పడం ద్వారా ఆయనను తమ పార్టీ నాయకుడిగా తెలియచేపే ప్రయత్నం చేసారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో ఒక హోదా కల్పించి, ఎన్నికల ప్రచారంలో దింపడం ద్వారా పార్టీకి నూతన ఉత్తేజం కలుగుతుందని భావిస్తున్నారు.

హరికృష్ణ జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ట్వీట్ సహితం ఆసక్తి కలిగిస్తున్నది. ‘చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని పేర్కొనడంతో పాటు నేడు తన జయంతి సందర్భంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా టీడీపీ కార్యకర్తల్లో హరి నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాను అని పేర్కొనడం వెనుక ఉద్దేశ్యం ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి.

రానున్న ఎన్నికల్లో సినీ హీరో పవన్‌ను తట్టుకోవడానికి తమ పార్టీలోనూ హీరో ఉంటే బాగుంటుందని టీడీపీ భావిస్తున్నది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా హరికృష్ణ కుటుంబం నుంచి కూడా వారసుడ్ని తీసుకువస్తే నందమూరి కుటంబమంతా టీడీపీకి అండగా ఉందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళతాయి. అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన, నిర్ణయం ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది.

పదేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసినా, ఆ తర్వాత మహానాడు, తదితర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం, అమరావతి శంకుస్థాపనకు కూడా ఎన్టీఆర్ హాజరుకాలేదు. అయితే ఎన్టీఆర్ ను తీసుకువస్తే లోకేష్ రాజకీయ భవిష్యత్ పై పడనున్న ప్రభావం గురించే చంద్రబాబు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు.