దేశ ప్రాధాన్య పార్టీగా అవతరించిన బిజెపి

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా భాజపా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి పాటుపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 

‘39ఏళ్ల క్రితం ఇదే రోజున.. సమాజానికి సేవ చేయాలని, దేశాన్ని సరికొత్త శిఖరాలను తీసుకెళ్లాలనే అకుంఠిత సంకల్పం, నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఈ రోజు భాజపా దేశ ప్రాధాన్య పార్టీగా అవతరించింది. ఇందుకోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు'  అని తెలిపారు. 

`ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి భావాలతో బిజెపి నేడు ఉన్నత స్థాయిలో ఉంది. తోటి ప్రజలకు సాయం చేసేందుకు పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. మా అభివృద్ధి పనులతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాం. గత ఐదేళ్లలో ప్రజల కోసం ఎంతో చేశాం. దేశం కోసం ఇంకా మరెన్నో చేయాలని ఉంది. మరోసారి యావత్‌ భారత ప్రజల ఆశీర్వాదం పొందుతామని విశ్వసిస్తున్నాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. 

1980 ఏప్రిల్‌ 6న జనసంఘ్‌ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే సాధించింది. అయితే ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి జయకేతనం ఎగురవేస్తామని బిజెపి నేతలు ధీమాగా ఉన్నారు.