ఐదేళ్లుగా యథేచ్ఛగా దోపిడీ సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

గత ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీ సభ్యులు యథేచ్ఛగా దోపిడీ సాగించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రమైన విమర్శలు చేసారు. ప్రజల సొమ్మును దోచుకుని ఆ సొమ్ములో కొంతభాగం ఖర్చుచేసి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బూటకపు వాగ్దానాలు, కల్లబొల్లి కబుర్లు చెబుతున్న చంద్రబాబు కుయుక్తులను ప్రజలు గమనించాలని పొన్నూరులో పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా పిలుపిచ్చారు.

రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన కోట్లాది రూపాయల్లో సింహభాగం దిగమింగిన బాబు, ఆ సొమ్ములోని కొంత భాగాన్ని తన సొంత పథకాలకు వినియోగించుకుని, తానేదో రాష్ట్ర ప్రజలకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కేంద్రం నిధులను వాడుకున్న చంద్రబాబు నేడు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నిధులను మంజూరు చేసిన ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనాన్ని చాటుతోందని మండిపడ్డారు.

2017లో అసెంబ్లీ సమావేశంలో మోదీ వంటి అవినీతి రహిత ప్రధానిని చూడలేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ నేడు రాజకీయ లబ్ధి కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పాలనలో తనకెంతో అనుభవం ఉందని నమ్మబలికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికార పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారే తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని స్పష్టం చేసారు. అభివృద్ధి మాట మరిచి దోచుకున్న చంద్రబాబు వేర్పాటువాద శక్తులతో దోస్తీకట్టి ప్రజలను ఏమార్చేందుకు కేంద్రప్రభుత్వంపై కువిమర్శలు చేయడాన్ని ప్రజలను గమనించి, ప్రతిఘటించాలని కోరారు.

చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించాల్సింది పోయి, ప్రజాసేవ చేస్తున్న కార్యదక్షుడైన మోదీ వంటి నేతలపై విమర్శలు చేసి ఓట్లు అడుగుతున్న తీరుకు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. బాబు హయాంలో అభివృద్ధి ఎండమావిగా మారిందని మండిపడ్డారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులను చేసిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తిరిగి అధికార పీఠమెక్కడం ఖాయమని, రాష్ట్రంలో కూడా బీజేపీని గద్దెనెక్కిస్తే ఇక్కడ కూడా అవినీతి రహిత పాలన అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. బీజేపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ నారాయణ, పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి బాల విజయ భాస్కరరెడ్డిలను గెలిపించాలని కోరారు.