ఉగ్రవాదుల పట్ల ప్రతిపక్షాల మెతక వైఖరి : మోదీ

కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎస్‌పీ వంటి పార్టీలు ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి వైఖరి వల్లే గతంలో ఉగ్రవాదులు బలపడ్డారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన బీజేపీ ప్రచార సభలో ప్రసంగిస్తూ ఈ పార్టీలు వోట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. 

‘‘ఈ పార్టీలు అనుసరించిన మెతక వైఖరి ఉగ్రవాదులకు సాయపడటం మాత్రమే కాకుండా మీ జీవితాలను, భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల బువా, బబువా (అఖిలేశ్ యాదవ్, మాయావతి) ఉగ్రవాద దాడులకు పాల్పడినవారిని స్వేచ్ఛగా వదిలిపెట్టేవారు’’ అని మోదీ మండిపడ్డారు. 

గడచిన ఐదేళ్ళలో పరిస్థితులను తన ప్రభుత్వం గణనీయంగా మెరుగుపరచిన్నట్లు చెప్పారు. ‘‘ఏదైనా చేస్తే, పాతాళంలో దాక్కున్నా మోదీ గుణపాఠం చెబుతాడని ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసొచ్చింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నేను మౌనంగా కూర్చోవాలా? లేదంటే ఎదురు దెబ్బ తీయాలా? ఉగ్రవాదుల ఇళ్ళల్లో భారతదేశం దూరి, వాళ్ళ మీద దాడి చేస్తే, కొందరు ఏడవడం మొదలెట్టారు’’ అని తెలిపారు. 

ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారత సైన్యం నిర్వహించిన దాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ప్రపంచంలో పాకిస్థాన్‌ ఇరుకునపడుతున్న సమయంలో, ఆ దేశంలో హీరోలుగా మారాలని ఇక్కడివాళ్ళు ప్రయత్నిస్తున్నారని అంటూ ప్రతిపాకధల ధోరణిని ఎండగట్టారు. 

కాగా, దళితులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ప్రధాని  మోదీ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ను ఓడించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అంబేద్కర్‌ గురించి కాంగ్రెస్ మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.