కుమార్తె కవిత గెలుపుపై కేసీఆర్ ఖంగారు... మండవ ఇంటికెళ్లి మంతనాలు!

తెలంగాణలో మొత్తం 16 లోక్ సభ స్థానాలను గెలుచునుకొని ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నట్లు నిత్యం చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఇప్పుడు అకస్మాత్తుగా నిజామాబాదులో కుమార్తె కవిత తిరిగి గెలుపొందటంపై ఖంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నది.

మొదట్లో ఆమె గెలుపు పట్ల ధీమాగా ఉన్నప్పటికీ అనూహ్యంగా గిట్టుబాటు ధరల విషయంలో రైతులు తిరుగుబాటు ధోరణి ప్రదర్శించి భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడం, బిజెపి అభ్యర్థి డి అరవింద గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలోనే ఉంటూ పెద్ద ఎత్తున మద్దతు సమీకరించు కోవడంతో పాటు సొంత పార్టీ లోనే కుమార్తె ధోరణి పట్ల అసమ్మతి పెరుగుతున్నట్లు తెలుసుకొని ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన సమయం నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ టిడిపి నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా కేసీఆర్ వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరమని ఆహ్వానించడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. ఎటువంటి మచ్చ లేని రాజకీయవేత్తగా పేరున్న ఆయన నిజామాబాదు జిల్లాకు చెందినవారే. రాజకీయాలలో క్రియాశీలంగా లేకపోయినప్పటికీ ఎప్పుడు గ్రామస్థాయిలో జనంతో సంబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. మరోవంక టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు సన్నిహితుడు కూడా.

కేసీఆర్ అధికారంలోకి రాగానే తెలంగాణలోని అనేకమంది టిడిపి ప్రముఖ నేతలు అధికారపక్షంలో చేరి మంత్రి పదవులతో సహా పలు పదవులు చేపట్టినా ఆయన మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. తొలుత ఉదయం ఆయనను కలిసి  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మంతనాలు జరిపారు. ఆయన పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మండవ ఇంటికి వెళ్లిన్నట్లు చెబుతున్నారు.

మండవ నిజామాబాద్‌లో గట్టి పట్టున్న నేత కావడంతో  ఆయన పార్టీలో చేరడంతో అక్కడ కవిత గెలుపుకు దోహదపడగలరని భావిస్తున్నారు. ప్రస్తుతం టిడిపి ఎన్నికల బరిలో లేనందున ఆ పార్టీ నేతలను, వారి ఓటు బ్యాంకును కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకోనే విధంగా మండవ చేయగలరని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం నిజామాబాదు లో 185 మంది పోటీలో ఉండగా, వారిలో 178 మంది రైతులే. వారంతా కలసి గ్రామాలలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు సమీకరిస్తున్నారు. పైగా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ, బాలట్ బాక్స్ లతో ఎన్నికలు జరపాలని కోరుతూ వారు హై కోర్ట్ ను కూడా ఆశ్రయించారు.