తెలంగాణా ఎన్నికలలో అమిత్ షా సారధ్యం !

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపడం కోసం ఒక వంక ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కసరత్తు చేస్తుండగా, బిజెపి సహితం ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడం కోసం, తమ బలాన్ని గణనీయంగా పెంచుకోవడం కోసం కసరత్తు చేస్తున్నది. ఎన్నికల వ్యూహరచనలో సిద్దహస్తుడిగా పేరున్న బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణలో పార్టీ ఎన్నికల వ్యూహాలను, ప్రచారాన్ని ముందుండి నడిపించడం కోసం సిద్దపడుతున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికలలో దేశంలో కొత్తగా బలం పెంచుకొనే దిశలో వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్న రాష్త్రాలలో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ యంత్రంగాన్ని సమాయత్తం చేయడం ప్రారంభించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాల జాతీయ సమన్వయ సమావేశంలో పాల్గొన్న తిరిగి వెడుతూ ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యులతో రెండు గంటల సేపు ఈ విషయమై అమిత్ షా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్ షా ఒక అంశాన్ని స్పష్టం చేసారు. ప్రభుత్వపరంగా కేంద్రం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంతో సామరస్య సంబంధాల కోసం సుముఖత వ్యక్తం చేసినా రాజకీయంగా ఎటువంటి ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే బిజెపి అన్ని సీట్లలో తెలంగాణలో పోటీ చేయాలని, ఎవ్వరితో – కొన్ని వర్గాలు వదంతులు వ్యాప్తి చేస్తున్న విధంగా అధికార టి ఆర్ ఎస్ తో పొట్టు ఏర్పాటు చేసుకొనే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.

తెలంగాణలో ఎన్నికలు ముందస్తు జరిగినా,  షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొందామని అమిత్ షా తేలిపారు. తెలంగాణ ఎన్నికలను పార్టీ అధిష్టానం ఆషామాషీగా తీసుకోదని, నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు జరుగానున్న నాలుగు  రాష్ట్రాల బాధ్యతలను అక్కడి ముఖ్యమంత్రులకు అప్పగించి తెలంగాణపై తానే స్వయంగా ముందుంది పార్టీని నడిపిస్తానని భరోసా ఇచ్చారు.

మరో వారం, పది రోజులలో తెలంగాణలో ఎన్నికల శాఖారావం పూరించడానికి స్వయంగా అమిత్ షా రానున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ నెల 12 లేదా 15న పాలమూరులో భారీ బహిరంగ సభ జరిపేందుకు బిజెపి రాష్ట్ర అద్యక్షుడు డా. కే లక్ష్మణ్ నిర్ణయించారు. ఆ తర్వాత కరీంనగర్ లో అటువంటి సభ జరుపనున్నారు.

ఢిల్లీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ఎన్నికల అంశంపైనే చర్చిస్తామని, ప్రత్యేకంగా 8న పూర్తి చర్చ తెలంగాణ పైనే ఉంటుందని చెప్పారు. పార్టీ ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్న సౌదాన్ సింగ్ తో పాటు, కర్ణాటక ఇన్ ఛార్జ్ సంతోష్ ను కుడా తెలంగాణపై దృష్టి సారించమని నియమిస్తున్నట్టు తెలిపారు. సంతోష్ కు పూర్తిగా ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గ పరిధిలో జాతీయ స్థాయి నేతలతో సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, ఎంపీలు కూడా రాష్ట్రానికి వస్తారని తెలిపారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఇక్కడి ఎన్నికల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆదేశించారు.

అమిత్ షా ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ముందస్తు ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఈ నెల రెండోవారంలో (12 లేదా 15 తేదీన) అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించామని ఆయన తెలిపారు.