చంద్రబాబుకు ఎన్డీయే తలుపులు శాశ్వతంగా బంద్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్డీయే తలుపులు శాశ్వతంగా మూసుకు పోయిన్నట్లు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. నరసరావుపేటలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మోదీ గెలిస్తే తిరిగి ఎన్డీయేలోకి వద్దామని చంద్రబాబు మనసులో ఉందని చెప్పారు.  రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనలో కనీసం చెప్పుకోడానికి ఏమీ లేకే మోదీపై విమర్శలు చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. 

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు అంత అవకాశవాది దేశంలో మరెవ్వరూ లేరని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో దేశం అంతా మోదీ గాలి వీయటంతో.. దానిని గమనించి మోదీకి దగ్గరై కలసి పోటీచేశారని,  ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త నాటకాన్ని ప్రారంభించారని, మోదీని విమర్శించి రాష్ట్రంలో సానుభూతిని పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టి ఘోరంగా ఓడిపోయారని అమిత్ షా గుర్తు చేశారు. అది గమనించి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రె్‌సతో చంద్రబాబు పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. పోలవరానికి రూ.7,500 కోట్లు కేటాయిస్తే నిర్మాణ పనులు వేగవంతం చేయకుండా ముఖ్యమంత్రి, మంత్రులు కమీషన్ల రూపంలో దిగమింగేశారని.. పనుల పురోగతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం రూ.5.56లక్షల కోట్ల నిధులిచ్చిందని చెబుతూ అమరావతి నిర్మాణంలో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రులు కలలు కన్న రాజధాని అమరావతిని, పోలవరం నిర్మాణాలను అద్భుతంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

టీడీపీ, వైసీపీ రెండూ అవినీతి పార్టీలే. వీటిల్లో కుటుంబపాలన సాగుతుందని అమిత్‌ షా ఆరోపించారు. బీజేపీ మాత్రమే రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందిస్తుందని చెప్పారు.  రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 14 అంశాలలో 11 అంశాలను ఐదేళ్లలోపే పూర్తి చేశామని తెలిపారు. వాటిని పదేళ్లలో పూర్తి చేయటానికి అవకాశం ఉన్నా కేంద్రం వేగవంతంగా ఆయా విద్యాసంస్థల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించకపోవటం వల్లనే మరికొన్ని సంస్థల నిర్మాణాలు సాధ్యపడలేదని చెప్పారు.