ఏప్రిల్ 7న బిజెపి మేనిఫెస్టో విడుదల !

మరో వారం లోగా తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు జరగనుండగా బీజేపీ ఈ నెల 7న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో పాటు, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తదితరుల చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

బీజేపీ ఏర్పాటు చేసిన 20 మంది సభ్యుల మేనిఫెస్టోకు కమిటీకి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించగా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, ముక్తార్ అబ్బాస్ నఖ్వి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్‌కు 15 సబ్ కమిటీలున్నాయి.

బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోను 'సంకల్ప్ పాత్ర' పేరుతో లోక్‌సభ ఎన్నికల మొదటి తేదీ (తొమ్మిది విడతలు) అయిన ఏప్రిల్ 7న విడుదల చేసింది. ఈ సారి కూడా అదే తేదీన విడుదల కానున్నది. కాగా, ఈసారి  పోలింగ్‌కు 48 గంటలకు ముందు ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ గత మంగళవారంనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.