లష్కరే తొయిబా ఉగ్రవాది అరెస్ట్... లైవ్ గ్రనేడ్ స్వాధీనం

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాల్లో లష్కరే తోయిబాకి చెందిన ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. జింద్‌పాల్ సహా ఉత్తర కశ్మీర్‌లోని తంగ్‌మార్గ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టిన కార్డన్ సెర్చ్‌ సందర్భంగా అతడు పట్టుబడినట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. 

జింద్‌పాల్‌లో గాలింపు జరుగుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడని... పోలీసులు అతడిని సమీపిస్తుండగానే పారిపోయేందుకు ప్రయత్నించాడని ఆయన తెలిపారు.

అతడిని వెంటాడి పట్టుకున్న పోలీసులు పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని జింద్‌పాల్‌కు చెందిన ఫిర్దోస్ ఖాన్‌గా గుర్తించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.