ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా

ఎన్నికల వేళ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది వద్ద ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి  జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100కోట్లు జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా అక్రమంగా ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్‌ మ్యాన్‌ రాజేంద్ర సింగ్‌, అనుమోలు గాంధీ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. 

కాగా నిబంధనల ప్రకారం పది టైర్ల లారీకి 21 టన్నులు లోడ్‌ చేయాల్సి ఉండగా, 30 నుంచి 40 టన్నులు లోడ్‌ చేస్తూ పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటితే చాలు 60, 70 కిలోమీటర్ల స్పీడ్‌తో బాడీ లారీలు కాబిన్‌ లెవల్‌ ఇసుక లోడ్‌ వేసుకొని పరుగులు తీస్తున్నాయి. 

పోలీసులు ఎక్కడైనా గస్తీ కాస్తుంటే ముందస్తుగానే లారీ డ్రైవర్లకు సమాచారం ఇచ్చేందుకు మూడు కార్లను ఉపయోగించి, కొంతమంది తిరుగుతూ లారీ డ్రైవర్లకు సమాచారం ఇస్తున్నారు. 

ఎవరైనా అధికారులు కానీ, పోలీసులుకానీ ఉన్నారని తెలిస్తే రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం చెరువు, మందడం, మందడం బైపాస్‌రోడ్డులో లారీలను గప్‌చుప్‌గా పక్కనపెట్టి అధికారులు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి వారి గమ్య స్థానాలకు బయల్దేరుతున్నారు. ప్రతిరోజూ కనకదుర్గ వారధి మీద నుంచి కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిపోతుంది.