అమరావతి బాండ్లు కొన్నదెవరు?

ఒకవంక అసాధారణమైన వడ్డీకి అమరావతి బండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కెట్ లో అమ్మకానికి పెట్టడం వివాదంగా మారితే, తాజాగా ఈ బాండ్లను ఎవ్వరు కొనుగోలు చేసారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వంలోనే పెద్దలకు సంబంధించిన వారే వీటిని హస్తగతం చేసుకొని ఉండవచ్చనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన అమరావతి బాండ్లను కొన్న తొమ్మిది మంది పేర్లు బయటపెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేయడంతో ఈ విషయమై ఏదో గూడుపుటాణి జరిగి ఉండవచ్చనే అనుమానాలు చెలరేగుతున్నాయి. రాజధాని కోసం అధిక వడ్డీకి బాండ్లు జారీచేయడం ఏ విధంగా చూసినా ఆమోదయోగ్యం కాదనే విమర్శలు పలు వర్గాల నుండి వెలువడుతున్నాయి.

అప్పు చేసిన రూ.2 వేల కోట్లకు ప్రతి మూడు నెలలకొకసారి 10.36 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉందని, పైగా బ్రోకర్‌కు రూ.17 కోట్లు కమీషన్‌ ఇవ్వడం మరీ విడ్డూరంగా ఉందని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయట పెట్టకపోవడాన్ని పారదర్శకత అంటారా? అని ఆయన ప్రశ్నించారు.

అధిక వడ్డీకి అప్పు చేయవద్దని ఏడు నెలల క్రితం జీవో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అధిక వడ్డీకి బాండ్లు జారీచేయడం ఏమిటని ఉండవల్లి ప్రశ్నించారు. గతంలో మర్చంట్‌ బ్యాంకుగా ఉండేందుకు రూపాయి జీతం తీసుకుంటామని ఏకే కేపిటల్‌ పేరుతో వచ్చిన వ్యక్తికే ఇప్పుడు రూ.17 కోట్లు బ్రోకరేజీ ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

అప్పట్లో విజన్‌ 2020 రూపొందించిన ముఖ్యమంత్రి  చంద్రబాబు సలహాదారు మెకన్సీ ప్రస్తుతం చికాగో జైలులో ఉన్నారని ఉండవల్లి ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వపు ఆర్ధిక విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ ప్రభుత్వం మద్యాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూడడం దారుణమని విమర్శించారు. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌ రూ.50కి విక్రయిస్తున్నారని, అయితే దీని తయారీ, ప్యాకింగ్, రవాణాకు రూ.8.50 అవుతోందని చెబుతూ షాపు వాళ్లకు రూ.3.75 ఆదాయం ఇస్తుండగా మిగిలిన రూ.37.75లు ప్రభుత్వానికి చేరుతోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2,25,234 కోట్లు ఉందని ఉండవల్లి చెబుతూ ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అప్పు రూ.1.30లక్షల కోట్లని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏం చేశారని నిలదీశారు. ప్రస్తుతం పెట్రోలు ధర రూ.85 ఉండగా, మనకు రూ.32లకు వస్తోందని, కేంద్రానికి రూ.19 పన్ను రూపంలో పోతుండగా, మిగతా మొత్తం రాష్ట్రానికి వెళ్తోందని వివరించారు. పెట్రోలు కొట్టించుకున్న తర్వాత వినియోగదారులకు ఇచ్చే బిల్లులో ఈ వివరాలు కేరళలో పొందుపరుస్తారని, మన రాష్ట్రంలో ఇలా నిజాలు చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు.