కేరళలో వర్షాలకు 22 మంది మృతి

రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తు‍న్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని స్ధంభింప చేశాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో దాదాపు 22మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వరదలు ముంచెత్తడంతో అనేక నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 26 సంవత్సరాల తరువాత మొదటి సారి ఇడుక్కి డ్యామ్‌ గేట్లను తెరిచినట్టు అధికారులు ప్రకటించారు. కేరళలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని కేరళ ముఖ్యమంత్రి పినరన్‌ విజయ్‌ ప్రకటించారు.

వరద పరిస్థతిని అంచనా వేసేందుకు గురువారం తిరువనంతపురంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 22డ్యామ్‌లను గేట్లను ఇప్పటికే ఎత్తివేశామనీ, ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోఎప్పుడూ సంభవించ లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, పరిస్థితిని అదుపుచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అత్యవసర నంబర్లను ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఎమర్జన్సీ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.

అత్యవసర సమాచారం కోసం 0484 3053500 నెంబరు సంప్రదించాల్సిందిగా అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న జిల్లాలోని తూర్పు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కారణంగా అనేక కుటుంబాలు దగ్గరలో ఉన్న సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అలప్పు, ఇడుక్కి, వాయినాద్‌, కొల్లాం, మల్లాపురం జిల్లాలు వరదలు, గాలులతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు పాటు భారీనుంచి, అతి భారీ వర్షాలు కురవన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలను మూసివేశారు.