అవినీతిలో కూరుకు పోయిన టీడీపీ, వైసీపీ

అవినీతి అక్రమాలలో కూరుకుపోయిన టీడీపీ, వైసీపీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తున్నాయని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్  నిలదీసారు.  అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్నిజరుపుతూ అవినీతిలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని విమర్శించారు.  

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిని సమూలంగా నిర్మూలిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఇక్కడ మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెబుతూ వైసీపీ నాయకుడు జగన్‌పై వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఇటువంటి వారు ప్రజలను ఏ విధంగా ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. 

ప్రకృతి అందాలకు నిలయమైన పాడేరు ప్రాంతంలో పేదరికం, వెనుకుబాటు తనం ఈ ప్రాంత వాసులను వేధిస్తున్నాయని, ఇందుకు ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు.  మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్టిక్కర్ తగిలించుకుని తానే అన్నీ చేస్తున్నానని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

ఎన్నికల్లో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశ భద్రత లభిస్తుందని, అభివృద్ధి వచ్చి గౌరవంగా బతకవచ్చని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాలుగు జిల్లాల్లో గిరిజన ప్రాంతాలన్నింటినీ కలుపుతూ అల్లూరి జిల్లాను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తన పోరాటాన్ని మన్య ప్రాంతం నుంచే సాగించారని, ఇటువంటి గొప్ప విప్లవవీరుడు అల్లూరి పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి అరకులోయ పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.