ప్రధానిపై అనుచిత వాఖ్యలు తగవు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హితవు చెప్పారు. ఇటీవల అనేక ఎన్నికల సభల్లో మోదీపై టీఆర్‌ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. 

రాజకీయాల్లో సహేతుకమైన విమర్శలు ఉండాలని, నిరాధారమైన ఆరోపణలతో అభాండాలు వేయడం తగదని స్పష్టం చేశారు. మోదీపై ఆరోపణలు చేసే స్థా యి కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీకి 150 సీట్లకు మించి రావని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారని, 300 సీట్లు వస్తే రాజకీయసన్యాసం చేస్తారా? అని సవాల్ చేశారు. ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ.2.20 లక్షల కోట్లను మంజూరు చేసిందని బండారు స్పష్టం చేశారు. అలాగే రూ.30వేల కోట్ల నిధులను గ్రాం టుగా ఇచ్చిందని చెప్పారు. 

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ.62వేల కోట్ల నిధులను ఇచ్చిందని బీజేపీ ఎంపీ వెల్లడించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా నిధులను మంజూరు చేసినందుకు ప్రధాని మోదీ సర్కార్‌ను ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తుంటే, రాష్ట్రానికి నిధులు విదిలించారంటూ టీఆర్‌ఎస్ వ్యాఖ్యానించడం దారుణమని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి, క్యాంప్ ఆఫీసుకు పరిమితమై పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. సచివాలయానికి రాని సీఎంకు ప్రజలతో సంబంధం ఏముంటుందని ఎద్దేవా చేశారు. 

ఓట్ల కోసం స్థాయిని దిగజార్చుకుని మాట్లాడడం బాధాకరమని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మజ్లిస్‌తో జతకట్టి మతతత్వశక్తులకు ఊతం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, తమ పార్టీ అభ్యర్థులు ఎక్కువ సీట్లు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతోందని, ప్రజావ్యతిరేకత ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి వ చ్చే ఎన్నికల్లో పట్టం కట్టనున్నారని ఆయన జోస్యం చెప్పారు.