ఎపికి ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక ట్రీట్‌మెంట్‌

'ఎపికి ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ అందిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా టిడిపి, వైసిపి ఉండొచ్చూ.. ఉండకపోవచ్చు.. ఎపికి మాత్రం స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ కొనసాగుతుంది' అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ వరికి కనీస ధరను కేంద్రం ప్రకటించినా ఇక్కడ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. 

కేంద్రం మత్స్యశాఖకు ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేయడం వల్ల ఎక్కు మంది మత్స్యకారులున్న ఈ జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నర్సాపురం మండలం బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు. పామాయిల్‌ పంటను పండించే రైతులకు ధర విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెడితే.. ఎపి ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటుందని ధ్వజమెత్తారు. 

రాహుల్‌ గాంధీ 20 కోట్ల మందికి ఏడాదికి రూ.72 వేలు ఇస్తానంటూ చెబుతున్నారని, 1.25 లక్షల ఆదాయం తక్కువగా ఉండాలని చెబుతూ సరైన స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ లేని భారతదేశాన్ని నిర్మిస్తేనే పేదరికం తొలగిపోతుందని చెప్పారు. పాకిస్తాన్‌ మారకపోతే పదేపదే సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసి బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. 

బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే బందరు పోర్టు నిర్మాణంపైనే తొలిసంతకం పెడతామని రాజ్‌నాథ్‌ సింగ్‌ అవనిగడ్డలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్ళల్లో రాష్ట్రప్రభుత్వం బందరు పోర్టు శంకుస్థాపనతోనే సరిపెట్టిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్‌వాద్‌ నిధి కింద ప్రతి ఎకరానికి రూ.6 వేలు రైతులకు మూడు దఫాలుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రైతుల వివరాలు ఇవ్వకుండా చంద్రబాబు కుట్ర చేశారని విమర్శించారు.  

ప్రజలకు న్యాయం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత బాహుబలి అని, ఆయనను ఎన్ని కుట్రలు చేసి, పదవి నుండి దించేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నించినా సాధ్యం కాదని తాడేపల్లిగూడెంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. 2029 వరకూ బీజేపీకి అధికారం ఇస్తే ప్రపంచంలో అగ్రదేశాల సరసన భారత్ ఉంటుందని భరోసా ఇచ్చారు.