మహిళలకు అండగా ఉంటా: మాధవి లత

తెలుగు నాట రాజకీయాలకు, సినిమాలకు విడదీయ లేని సంబంధమే ఉంది. ప్రజా సమస్యలను అర్థం చేసుకునే మనసుంటే రాజకీయాల్లో రాణించవచ్చంటున్నారు సినీనటి, బిజెపి నాయకురాలు మాధవి లత. కొన్ని నెలల క్రితమే ఆమె బిజెపిలో చేరారు. ఆమె ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు, ఎన్నికల్లో గెలుపొందితే గుంటూరులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను "ఈనాడు"తో జరిపిన ముఖాముఖిలో వివరించారు : 

మీ ప్రచారం నియోజక వర్గంలో ఎలా సాగుతోంది?
ప్రచారమైతే బ్రహ్మాండంగా సాగుతోంది. రోజూ ప్రజల్లోనే ఉంటున్నాను దాదాపు అన్ని డివిజన్లలలో ప్రచారం నిర్వహిస్తున్నాను. ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. మీరు నన్ను గెలిపించుకుంటే మీ ఇంటి అమ్మాయిగా ఉంటాను అని చెబుతున్నాను. వారు కూడా నన్ను వాళ్లింటి అమ్మాయిగానే భావిస్తున్నారు. నేను బాగా ఆలోచించి మాట ఇస్తాను. ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోను. 

మీకు రాజకీయాలు, గుంటూరు రెండూ కొత్త. మరి ఇక్కడి సమస్యలు, పరిస్థితులపై ఎలాంటి అవగాహన ఉంది?
ఇక్కడ ఉన్న ప్రజల భాష, సంప్రదాయాలు తప్ప సమస్యలు అన్నీ మామూలే. అన్ని ప్రదేశాల్లో ఉండే సమస్యలే ఇక్కడా ఉన్నాయి. డ్రైనేజీ, రోడ్లు, నీరు రాకపోవడం, వృద్ధులకు పింఛన్‌ అందకపోవడం లాంటి సమస్యలే ఉన్నాయి. 

యువతరం, మహిళలకు ప్రతినిధిగా వారికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 
మేము కొత్తగా మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక కోర్టులు తీసుకొస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే వాటిని ఆచరణలో పెడతాం. ముస్లిం మహిళలకు ట్రిపుల్‌ తలాక్‌ని రద్దు చేయడం జరిగింది. ఇలాంటి పథకాలతో ఒక మహిళగా గుంటూరు మహిళలకు అండగా ఉంటాను. 

సినీ ప్రముఖులు అందరూ ఆంధ్రప్రదేశ్‌లో పేరున్న ప్రాంతీయ పార్టీల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. మీరు మాత్రం వారికి భిన్నంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిజెపిలో చేరారు. ఒక విధంగా ఇది ఏటికి ఎదురు ఈదడమేనని మీకు అనిపించడం లేదా?
ప్రాంతీయ పార్టీలను ఎంచుకుంటే మనం ఒక ప్రాంతానికే పరిమితం అవుతాం. ఒకవేళ మంచి ప్రాంతీయ పార్టీలో చేరదామన్నా ఏపీలో నాకు మంచి నైతిక విలువలున్న పార్టీలు కనిపించడం లేదు. నాకు తెలిసినంత వరకు మా కుటుంబం వారు కూడా ఇష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ పార్టీలో చేరాను. 

గుంటూరు నియోజకవర్గం నుంచి మీరు విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. అసలు మీ ప్రణాళికలు ఏంటి? 
గతంలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి అటు రాష్ట్ర ప్రభుత్వంతో, ఇటు ప్రజలతో కానీ సంబంధాలు కొనసాగించలేదు. ఆయన సమన్వయంతో పని చేసి ఉంటే ప్రజలకు కొంత వరకైనా మేలు జరిగి ఉండేది. ఇప్పటికైనా రోడ్లు, కొన్ని మౌలిక సదుపాయాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయంటే అందుకు కారణం మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ పుణ్యమే అని చెప్పుకోవాలి. ఆయన తర్వాత వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. 

ఒకవేళ మాధవి లత ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ సినిమాల్లోకి వెళతారా లేక రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తారా?
ప్రజలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. నేను ఇక్కడ ఉన్న నాయకుల్లాగా బీకాంలో ఫిజిక్స్‌ చదువుకున్న వ్యక్తినైతే కాను. నేను చదువుకోవాల్సినవే చదువుకున్నాను. నన్ను గెలిపిస్తే ప్రజల్లో ఉండి సేవ చేస్తాను. ఒకవేళ ఓడిపోయినా బిజెపి నిర్ణయం ప్రకారం ప్రజల్లో ఉండి వారికి సహాయపడతాను. 

సినీ నటులకు రాజకీయాలు, సామాజిక సేవ పైనా అవగాహన కొంత తక్కువగా ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో మీరు ఎలా అవగాహన పెంచుకున్నారు?
సినిమా వారందరూ మంచి వారే. వారికి ప్రజలకు సేవ చేయ్యాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప ప్రజల దగ్గర దోచుకోవడం లాంటివి తెలీదు. వాళ్లకు అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. కొంత మంది అనుకోకుండా రాజకీయాల్లోకి వస్తారు. కాని వారు వచ్చాక రాజకీయాలు నేర్చుకుంటారు. 2014లోనే రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాను. కానీ వాటి గురించి తెలుసుకుని వస్తే మంచిది అని ఆగిపోయాను. ఐదేళ్లుగా రాజకీయాల గురించి నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. 

ప్రకాశం జిల్లాలో పుట్టిన అమ్మాయి ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి వచ్చింది. ఇది ఎలా చూడాలంటారు?
ఆంధ్రప్రదేశ్‌లో అన్నింటి కన్నా గుంటూరు జిల్లా రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, ఎంపీ అభ్యర్థి జై ప్రకాశ్‌ నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారితో కలిసి ప్రజల్లోకి వెళుతున్నాను. ఒకవేళ నాకు ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను. నా వెనుక పార్టీ ఉంటుందన్న నమ్మకం నాకుంది.