కాశ్మీర్‌కు మరో ప్రధాని ప్రతిపాదనకు తల వంచే ప్రసక్తే లేదు

తాము అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్ష పార్టీగా నిలిచినా, జమ్మూ-కాశ్మీర్‌కు విడిగా మరో ప్రధాని ఉండాలన్న ప్రతిపాదనకు తల వంచే ప్రసక్తే లేదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా  తేల్చిచెప్పారు. ఉత్తరకాశిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొంటూ జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధాని ఉండాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన డిమాండ్‌పై స్పందన ఏమిటో స్పష్టం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నిలదీశారు. 

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌సీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు. ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి, ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై స్పందించాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందని స్పష్టం చేశారు. జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాకు భంగం కలిగే ఎలాంటి చర్యనూ తాము సమర్థించబోమని ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రకటనను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

జమ్యూ-కాశ్మీర్‌కు మరో ప్రధాని ఉండాలని ఆయన తెరపైకి తెచ్చిన వాదనపై అమిత్ షా తీవ్రంగా స్పందిస్తూ ఒకే దేశంలో ఇద్దరు ప్రధానలు ఎలా ఉంటారని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకూ ఒమర్ అబ్దుల్లా వంటి నాయకుల కలలను నెరవేరనివ్వనని అమిత్ షా శపథం చేశారు. భారత్ మీకు సంబంధించిందేమోగానీ మాకు ఆ దేశంతో ఎలాంటి సంబంధం లేదు అంటూ జెఎన్‌యూలో నినాదాలు చేసి, అరాచకం సృష్టించిన వారికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

దేశాన్ని ముక్కచెక్కలు చేసే కుట్రలు జరుగుతున్నాయని, వాటికి కాంగ్రెస్ వంత పాటుతున్నదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే త్రివిధ దళాలకు ప్రత్యేక హక్కులను కట్టబెట్టే ఏఎఫ్‌ఎస్‌పీఏను మళ్లీ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇవ్వడంపై అమిత్ షా మండిపడ్డారు. నిజానికి సైన్యం పట్ల కాంగ్రెస్‌కు కనీస బాధ్యత లేదని ఆరోపించారు. సైన్యానికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ఓ శిఖరంగా నిలబడిందని ప్రశంసించారు. 

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబాట్లు ఎక్కువగా ఉండేవని ఆరోపించారు. మన సైనికుల తలలు నరికి, మళ్లీ సరిహద్దుదాటి పాకిస్తాన్‌కు వెళ్లేవారని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని, దాడులను ప్రేరేపిస్తున్న పాక్‌పై సర్జికల్ దాడులకు యూపీఏ సర్కారు ప్రయత్నించలేదని విమర్శించారు. సరిహద్దు వెంట పాక్ యుద్ధ ట్యాంకులను మోహరించినప్పటికీ, ఎన్డీఏ సర్కారు నేరుగా ఆ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని అమిత్ షా చెప్పారు.

పుల్వామా ఉగ్రదాడి, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకే తీరులో స్పందించారని విమర్శలు గుప్పించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే బీజేపీని మళ్లీ గెలిపించాలని చెబుతూ  కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగిస్తే, దేశం ముక్కలు కావడం ఖాయమని అమిత్ షా హెచ్చరించారు.