'అఫ్‌స్పా' సవరణతో వేర్పాటువాదులకు ఊతం : సీతారామన్

సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం (అఫ్‌స్పా) సవరణకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ జాతి వ్యతిరేక, వేర్పాటువాదులకు స్నేహహస్తం చాపే హామీ అని దుయ్యబట్టారు. 'అఫ్‌స్పా సవరణ చేస్తామంటూ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం సరైనదేనా? ఇది సాయుధ బలగాలను బలహీనపరచే జాతివ్యతిరేక చర్య అవుతుంది. వేర్పాటువాదులకు ఊతమిస్తుంది. భద్రతా బలగాలకున్న విశేషాధికారాలను నీరుగార్చడమే అవుతుంది' అని ఆమె దుయ్యబట్టారు. 

దేశ ప్రజల రక్షణకు సాయుధ బలగాలు అహరహం కృషి చేస్తున్నాయని, వారికున్న అధికారాలను మానవ హక్కులకు వ్యతిరేకంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. 'సాయుధ బలగాల ప్రత్యేకాధికారాలను హరించడమంటే సాయుధ బలగాల నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడం, జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలను పరిమితం చేయడం అవుతుంది. సాయుధ బలగాలకు అమరవీరుల హోదా కల్పించాలని ఓవైపు కోరుతున్న కాంగ్రెస్ పార్టీ, మరోవైపు అఫ్‌స్పాను సవరిస్తామంటూ వాగ్దానం చేస్తోంది' అంటూ సీతారామన్ విమర్శించారు. 

చట్టాన్ని సవరించాలనే ఆలోచన చేసే ముందు జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపరచే విషయంలో కాంగ్రెస్ పార్టీ సూచనలు చేస్తే బాగుంటుందని ఆమె హితవు పలికారు. శాంతిభద్రతలు సజావుగా అంటే ఆ చట్టం ఎత్తివేత సాధ్యమవుతుందన్నారు. అఫ్‌స్పాను తొలగించడానికి ఒక పద్ధతి ఉంటూ ఉందని, ఆ పద్ధతి ప్రకారమే అసోం నుంచి అఫ్‌స్పాను బీజేపీ తొలగించిందని చెప్పారు.

దోశద్రోహం చట్టాన్ని ఎత్తేస్తామంటూ కాంగ్రెస్ మాట్లాడుతుండటంపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ  కాంగ్రెస్ మేనిఫెస్టో దేశానికి ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టేసేలా ఉందని ఆమె చెప్పారు. దేశద్రోహం చట్టాన్ని ఎత్తేస్తేమని వారు (కాంగ్రెస్) చెబుతున్నారని, ఆ చట్టాన్ని ఎత్తివేసే హక్కు కాంగ్రెస్‌కు ఉందా అని నిలదీయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందని ఆమె స్పష్టం చేశారు. 

ఈ చట్టం ఎత్తివేయడం ద్వారా వారు ఎవరికి తోడ్పడాలని అనుకుంటున్నారని రక్షణ మంత్రి ప్రశ్నించారు. పుల్వామా దాడి అనంతరం వీర జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వాలంచూ చెబుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని కూడా నిర్మలా సీతారామన్ నిలదీశారు.