నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్‌ బాక్స్‌ మాయం

అద్బుతమైన హైదరాబాద్ నగర వారసత్వానికి గుర్తుగా మిగిలిన సాలార్ జుంగ్ ముజియంలో విలువైన చారిత్రతక ప్రాధాన్యత గల వస్తువులు క్రమంగా అదృష్యమవుతున్నాయి. తాజాగా నిజాం కాలం నాటి సువర్ణ, వజ్ర ఖచిత పురాతన వస్తువులను దొంగిలించారు. దుండగులు ఎంతో పక్కాగా, సీసీ కెమెరాలకు చిక్కకుండా చోరీకి పాల్పడ్డారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని పురానీహవేలి మస్రత్‌ మహల్‌లోని నిజాం మ్యూజియంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి మ్యూజియంలోకి చొరబడి పురాతన కళాఖండాల్ని అపహరించారు. సుమారు రెండు కిలోల బరువుతో వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌ బాక్స్‌, చెంచా, కప్పుసాసరును ఎత్తుకెళ్లారు.

చోరీ అయినవి పురాతన వస్తువులు కావడంతో వీటి విలువ కోట్ల రూపాయిలలోనే ఉంటుందని భావిస్తున్నారు. దుండగులు మ్యూజియం మొదటి అంతస్తులోని వెంటిలేటర్‌ ఇనుప కడ్డీలను తొలగించి లోపలికి ప్రవేశించారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 20 అడుగుల తాడు సహాయంతో లోపలికి దిగి చోరీ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

మ్యూజియం భద్రతను గ్రూపులైన్‌ సంస్థకు చెందిన ఎనిమిది మంది భద్రతాసిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పగలు ముగ్గురు, రాత్రి అయిదుగురు కాపలాగా ఉంటారు. ఎప్పటి మాదిరిగానే ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మ్యూజియానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం మ్యూజియం గ్యాలరీ తలుపు తెరిచేసరికి విలువైన వస్తువులు కనిపించలేదు.

గ్యాలరీ వెంటిలేటర్‌ నుంచి తాడు వేలాడుతూ కనిపించింది. మ్యూజియం పెవిలియన్‌ ట్రస్టు కార్యదర్శి రఫత్‌ హుస్సేన్‌ సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యూజియం లోపల పది సీసీ కెమెరాలున్నాయి. ఒక కెమెరాలో మాత్రం దుండగుడు తచ్చాడిన దృశ్యం నమోదైంది. దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

చోరీ విషయం తెలిసిన వెంటనే నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు.  డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఘటనపై ఆరా తీశారు. పది బృందాలతో వేట సాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

నిజాం మ్యూజియం చార్మినార్‌ సమీపంలోని పురానీహవేలిలో ఉంది. గతంలో ఇది నిజాంల ప్యాలెస్‌గా ఉండేది. అనంతరం నిజాం ట్రస్టు ఆధ్వర్యంలో 2000 ఫిబ్రవరి 18న మ్యూజియంగా మార్చారు. చివరి నిజాం మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహుదూర్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు 1936లో జరిగాయి. ఆ సమయంలో నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లోని జూబ్లీహాలులో సామంతులు, నవాబులు ఆయనకు విలువైన బహుమతులను అందించారు. వాటిని ఈ మ్యూజియంలో ప్రస్తుతం ప్రదర్శనకు ఉంచారు.