భారీ మెజారిటీతో గెలుస్తానని జయప్రద ధీమా !


ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీ అభ్యర్థిగా తన పుట్టిన రోజైన బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుపొందుతానని భరోసా వ్యక్తం చేశారు. "నా పుట్టిన రోజున బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

గతంలో ఇక్కడి నుండి రెండు సార్లు సమాజావాది పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఆమె 2010లో ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. అజాం ఖాన్ ద్వారా మొదట ఇక్కడి నుండి పోటీ చేసిన ఆమె తర్వాత వారిద్దరి మధ్య విరోధం నెలకొంది. తనపై ఆసిడ్ దాడికి ప్రయత్నం చేశారని ఆమె ఒకసారి ఆరోపించారు. రాంపూర్ నుండి తొమ్మిది సార్లు శాసనసభకు ఎన్నికైన అజాం ఖాన్ ఇప్పుడు సమాజావాది పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు బీఎస్పీ, ఆర్ ఎల్ డి మద్దతు ఇస్తున్నాయి. ఆమె గత వారమే బీజేపీలో చేరారు. 

గతంలో అజాం ఖాన్ ను అల్లాఉద్దీన్ ఖిల్జీతో పోల్చిన ఆమె బిజెపి వంటి ఒక పెద్ద పార్టీ అండతో మంచి మెజారిటీతో గెలుపొందగలనని భరోసా వ్యక్తం చేశారు. అమర్ సింగ్ తో కలిసి రాష్ట్రీయ లోక్ మంచ్ ను ఏర్పాటు చేసి 2012 శాసనసభ ఎన్నికలలో 360 సీట్లలో పోటీ చేసినా ఒక్క సీట్ లో కూడా గెలుపొందలేక పోయారు. అప్పటి నుండి ఆమె ఆమె రాజకీయంగా మౌనంగా ఉంటూ వచ్చారు. 

ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 1994లో తెలుగు దేశం పార్టీ లో చేరి రాజ్యసభకు ఎన్నికైన ఆమె తర్వాత చంద్రబాబు నాయుడుతో ఏర్పడిన విభేదాలతో ఆ పార్టీ నుండి బైటకు వచ్చారు. ఆర్ ఎల్ డి లో చేరి 2014లో బిజ్నోర్ నుండి గెలుపొందిన ఆమె గెలుపొందలేక పోయారు.