మమత బెనర్జీ ఓ స్పీడ్ బ్రేకర్... ఆ అడ్డు తొలగించండి

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని ఆమె అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమెను ‘‘స్పీడ్ బ్రేకర్ దీదీ’’గా అభివర్ణించారు. దారిలో ఆ అడ్డంకిని తొలగించాలని ప్రజలను కోరారు.

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బుధవారం జరిగిన బీజేపీ లోక్‌‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో తాను సాధించినంత అభివృద్ధిని పశ్చిమ బెంగాల్‌లో సాధించలేకపోతున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రానికి ఓ స్పీడ్ బ్రేకర్ ఉందని, ఆ స్పీడ్ బ్రేకర్ పేరు దీదీ అని వివరించారు. దీదీ పేదలను పట్టించుకోరని ఆవదన వ్యక్తం చేశారు. పేదరికం అంతమైతే, ఆమె రాజకీయాలు ముగిసిపోతాయన్నారు. సీపీఎం కూడా ఇదే వైఖరిని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ ప్రాజెక్టును దీదీ అడ్డుకున్నారని ప్రధాని దయ్యబట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజనను కూడా ఆమె అమలు చేయడం లేదని విమర్శించారు. మధ్య తరగతి వర్గాలు ఎంతో శ్రమించి, దాచుకున్న డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారని, వారి సొమ్ముకు రక్షణ, భద్రత కల్పించేందుకు తన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్స్ యాక్ట్‌ను ఆమోదించి, అమలు చేస్తోందని, దీనిని దీదీ పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయడం లేదని చెప్పారు.

టీఎంసీ నేతలు పోంజీ స్కామ్స్‌లో కూరుకుపోయారని ఆరోపిస్తూ ప్రజలు ఈ స్కీముల్లో దాచుకున్న డబ్బుతో టీఎంసీ నేతలు పారిపోయారని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో మోదీ ఈ ఏడాది 4 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మార్చి 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత జరిగిన తొలి సభ ఇది.