ఏపీలో కుటుంబ పాలన ... బాబు కుటుంభం నుండే నలుగురు పోటీ

ఏపీలో కుటుంబ పాలన కొనసాగుతోందని, సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబం నుంచి ఏకంగా నలుగురు పోటీ చేస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. విశాఖలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఏపీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరి టీడీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజల ప్రయోజనాలు, సంక్షేమం కోసం పాటుపడుతుంటే ఏపీలో ముఖ్యమంత్రి తమ స్వలాభం కోసం పాటుపడుతున్నారని ఆరోపించారు. 

ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వియ్యంకుడు, నటుడు బాలకృష్ణ, ఆయన అల్లుడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పోటీ చేసి రాష్ట్రాన్ని పంచుకున్నారని విమర్శించారు. కూటమి పేరుతో ఏర్పడిన ఆయా పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, అందువల్లే వీరంతా కలిసారని అంటూ  ఏపీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రుల కలయికపై విమర్శలు చేశారు. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు చేపట్టిందని, 11 ప్రాజెక్టుల్లో పది ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయనని గోయల్ తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం కోట్లాది రూపాయల మేర ఇచ్చిందని, అయితే టీడీపీ ప్రభుత్వం చదరపు అడుగుకి పది వేలు పెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేస్తోందని, దీనిపై తన వద్ద తగిన ఆధారాలున్నాయని తెలిపారు. ఇందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రపంచంలో తెలుగు ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలని చెప్పారు. 

రెవెన్యూ లోటు 22,500 వేల కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం తీర్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ గ్రాంట్ అదనపు ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, అయితే ప్రత్యేక హోదానిస్తే ఇవి ఉండవని, ఈ రెండింటి వల్లే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రూ.6,700 కోట్ల మేర ఇచ్చిందని చెప్పారు. 

దేశాభివృద్ధి కోసం పాటుపడేది బీజెపీ అని, దేశంలో ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తుందని వివరించారు. విజయవాడ సభలో ఏపీకి ఏమేమీ చేసాము, అభివృద్ధి ఏ విధంగా జరిగింది? వచ్చిన ప్రాజెక్టులేమిటి? అనే వాటిపై ప్రజలకు వివరించామని, ఇందులో స్పష్టత ఉందని పేర్కొన్నారు. 

అనకాపల్లి నుంచి జరుగుతోన్న ఆరులైన్ల రహదారి నిర్మాణం రాష్టవ్రిభజన చట్టంలో లేదని, మోదీ చొరవతోనే ఇది జరుగుతోందని తెలిపారు.