తెలంగాణలో దోపిడీ తప్ప పాలనా వ్యవస్థ లేదు

తెలంగాణలో దోపిడీ తప్ప పాలనా వ్యవస్థ ఉన్నట్టుగా కనిపించడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ సర్కార్ యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను విస్మరించి, మద్యాన్ని ఏరులై పారిస్తోందని విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోకపోవడంతో తెలంగాణలో 4500మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ సంకల్ప సభలో మాట్లాడుతూ ఆవేదన వెలిబుచ్చారు  

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు టీఆర్‌ఎస్ కు ఎప్పటికి సాధ్యం కాదని, ఈ విషయమై పగటి కలలు కంటున్నదని ఎద్దేవా చేశారు. అది ఈ ప్రాంతానికే పరిమితమైన పార్టీ అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టడం పట్ల తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపర్చేందుకు బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

టీఆర్‌ఎస్ సర్కార్ యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను విస్మరించి, మద్యాన్ని ఏరులై పారిస్తోందని విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోకపోవడంతో తెలంగాణలో 4500మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు మరింతగా వెసులుబాటు కల్పిస్తుందని రాజ్‌నాథ్ వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా అందిస్తున్న రూ.6వేల ఆర్థిక సహాయాన్ని గణనీయంగా పెంచుతామని చెప్పారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటిం చారు. ఈ ప్రాంత రైతుల అభిమతం మేరకు అవసరమైతే పసుపు బోర్డును ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమేనని, ఎర్రజొన్న సహా ఇతర పంటలన్నింటికి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిజాం సుగర్స్‌ను వంద రోజుల్లో స్వాధీనం చేసుకుంటామన్న టీఆర్‌ఎస్ వాగ్దానం ఐదేళ్లు గడిచినా అమలుకు నోచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మూతబడ్డ నిజాం చక్కెర కర్మాగారాలను తాము తప్పనిసరిగా తెరిపిస్తామని భరోసా కల్పించారు. రానున్న మూడేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే తమ ధ్యేయమనిని హోం మంత్రి హామీ ఇచ్చారు. మన్మోహన్‌సింగ్ హయాంలో ఐదేళ్లలో 25లక్షల ఇళ్లను నిర్మిస్తే, నరేంద్రమోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే కోటీ 30లక్షల ఇళ్లను నిర్మించి నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు కేటాయించిందని గుర్తు చేశారు. మహిళల ఆరోగ్యాల పరిరణక్షకై 7కోట్ల గ్యాస్ సిలెండర్లను పంపిణీ చేశామని, ధరల పెరుగుదలకు కళ్లెం వేశామని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఎన్‌డీఏ పాలనకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తుందని తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగిందని, బలహీన దేశమనే ముద్రను చెరిపేసుకుని అగ్రరాజ్యాల సరసన నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించడంతో ప్రపంచ దేశాలు ఎనలేని గౌరవం చూపుతున్నాయని తెలిపారు. పుల్వామాలో ఉగ్రవాద దాడులను తీవ్రంగా పరిగణిస్తూ భారత వాయుసేన పాక్‌లోని తీవ్రవాద శిబిరాలపై లక్షితదాడులు జరిపి ముష్కరులను తుదముట్టించిందని గుర్తు చేశారు. 

ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలని, తీవ్రవాదులను తన భూభాగం నుండి తరిమివేస్తూ వారికి శిక్షణ అందించే కార్యకలాపాలను మానుకోవాలని హెచ్చరించారు. తాజాగా, భారత్ ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి గురించి ప్రస్తావిస్తూ, అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా శరవేగంగా వృద్ధి చెందుతోందని, 2028నాటికి పై మూడు దేశాల్లో ఒక దానిని దిగువకు నెట్టి భారత్ మూడవ స్థానాన్ని ఆక్రమించడం ఖాయమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ పనితీరును చూసి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.