కాంగ్రెస్ వస్తే ఉగ్రవాదం, ,అధిక ధరలు, హింస తప్పవు !

కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఎప్పుడు అధికారంలోకి ఉన్నా ఉగ్రదాడులు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ  హెచ్చరించారు. ఆ పార్టీ అధికారంలో ఉంటే.. ఉగ్రవాదం, ధరలు, హింస, అవినీతి, నల్లధనం పెరుగుతాయని చెప్పారు. అదే విధంగా దేశ సౌభాగ్యం, దేశ విశ్వసనీయత, సాయుధ దళాల నైతిక స్థుర్యైం, నిజాయతీకి గౌరవం క్షీణించాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అవినీతి సహా అన్ని పెరిగిపోతాయని తెలిపారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో \నిర్వహించిన పలు సభల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లు ఉగ్రదాడులు జరిగాయని, ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడులు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కాపాలదారులకు, అవినీతిపరులకు మధ్య జరుగునున్నాయని చెప్పారు.

మీ కాపాలదారుడైన నేను ఐదేళ్లుగా చేసిన పనిని మీకు నివేదిస్తున్నానని, తమను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నపుడు పరిపాలన రివర్స్ గేర్‌లో ఉంటుందని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు రద్దు అవుతాయంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ప్రస్తావిస్తూ మాతో ఎవరు అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.  

తన ప్రత్యర్థులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ ఇటువంటి పుకార్లను ప్రచారం చేస్తున్నవారికి దీటైన సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ప్రజల మనసుల నుంచి కనుమరుగు చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. అప్పటి ఎన్నికల్లో కుట్రపన్ని అంబేద్కర్ ఓడించిందని తెలిపారు. రాహుల్ గాంధీ  కుటుంబం తన సొంత సభ్యులను ‘భారత రత్న’తో గౌరవించే విషయాన్ని గుర్తుంచుకొని రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌ను మర్చిపోయిందని దుయ్యబట్టారు.

ఒడిశాను అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తుంటే  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహకరించడం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ఒడిశా అభివృద్ధి కోసం కేంద్ర పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని, అయినప్పటికీ తమ శక్తివంచన లేకుండా పాటుపడుతున్నా మని మోదీ స్పష్టం చేశారు. 

2014 లో గనుక ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్లమని తెలిపారు. ఉత్తరప్రదేశ్, త్రిపురలో లాగా ఒడిశాలో కూడా అధికారంలోకి తేవాలని అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ఉంటే అభివృద్ధి మరింత సులువవుతుందని మోదీ పిలుపునిచ్చారు.