కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికే ప్రాంతీయ పార్టీల పోటీ

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీ వహిస్తున్నాయని, అందుకే మోదీని అధికారంలోకి రానీయకుండా చేయాలని చూస్తున్నారని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధాన మంత్రి అవుతారని స్పష్టం చేస్తూ దేశం కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఓటేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

 ప్రతిపక్షాలు తమ నేత ఎవరో చెప్పడంలో స్పష్టత ఇవ్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. దేశ రక్షణలో కూడా మోదీ తన శక్తిని చూపించారని పేర్కొంటూ అందుకే ప్రజలు కూడా బలమైన నాయకుడుగా మోదీని గుర్తించి మళ్లీ ప్రధానిగా  చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ప్రజలపై ఎలాంటి భారాలు వేయలేదని తెలిపారు. ఏ విధమైన పన్నుల భారం పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు.  

కాంగ్రెస్ విస్మరించిన మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. ఆహార భద్రత పథకం కేంద్రమేఅమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధుల కేటాయింపు చేయడం వల్ల గ్రామీణాభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని గెలిపించాలని కోరారు.  ప్రాంతీయ పార్టీల నేతల వారసులు అనేక మంది తమ తండ్రి పీఎం, లేదా ఉప ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.  

 వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని, మోదీ ప్రధాన మంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే వారందరూ పార్టీ మారారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారి నందుకు రాహుల్.. అబిడ్స్ సెంటర్లో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ను రద్దు చెసుకోవాలని సూచించారు.