రాహుల్ పోటీతో కేరళపై ప్రభావం ఉండదు

ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాద్ నుంచి కూడా రాహుల్ పోటీ   చేయడం వల్ల కేరళపై ఏదైనా ప్రభావం పడే అవకాశం లేదని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మురళీధరన్ స్పష్టం చేశాయిరు. రాహుల్ ఆకర్షణ శక్తి ప్రభావం కేరళ ప్రజలపై పడబోదన్నారు. కేరళ మిగతా రాష్ట్రాల వంటిది కాదన్నారు. గాంధీ కుటుంబం అంటే మిగతా రాష్ట్రాలకు ఏదో కొంత ఆసక్తి ఉంటే ఉండవచ్చునన్నారు. పేరు (గాంధీ)తో వచ్చే అన్ని విషయాల ప్రభావం కేరళపై ఎంత ఉంటుందనేది ఓ పెద్ద ప్రశ్న అని చెప్పారు.

పైగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ అన్నట్లు తయారవుతుందని చెప్పారు. అమేథీలో రాహుల్‌కు ఓటమి ఎదురు చూస్తోందని, దానిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఉండటం సాధ్యం కాదని మురళీధరన్ పేర్కొన్నారు. అమేథీలో బీజేపీ తరపున స్మృతి ఇరానీ బరిలో నిలిచారని, చెబుతూ గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో రాహుల్ సుమారు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. 

ఈ సారి మరింత ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎదుర్కొంటారని చెప్పారు.  అందుకే ఆయన సురక్షితమైన (వయనాద్) నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ అమేథీతోపాటు వయనాద్‌లో కూడా గెలిచినట్లయితే, ఆయనకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి వంటి పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆయన ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. 

ఒకవేళ వయనాద్‌లో గెలిచి అమేథీలో ఓడిపోతే, వయనాద్ ప్రజలకు అందుబాటులో ఉంటారా? రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచినట్లయితే, వయనాద్‌ ఎంపీగా కొనసాగుతూ, అమేథీకి రాజీనామా చేస్తారా? ఒకవేళ వయనాద్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి, అమేథీ ఎంపీగా కొనసాగితే, వయనాద్ ప్రజలను అమాయకులను చేయడమే అవుతుందని పేర్కొన్నారు.