ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు బిజెపితోనే సాధ్యం

2019 ఎన్నికల్లో ఏపీలోనూ బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని,  ప్రభుత్వం ఏర్పాటు బీజేపేతోనే జరుగుతోందని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ధీమా వ్యక్తం చేశారు. గతంలో సమైక్యాంధ్ర పేరుతో ప్రజను మోసం చేసిన పార్టీలే.. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీతో  తమకు రహస్య ఒప్పందమేమీ లేదని.. ఏపీలో ఓటు అడిగే హక్కు కేవలం బిజెపి మాత్రమే  ఉందని ‘ఈటీవీ’ ముఖాముఖిలో తెలిపారు. 

ఈ ఎన్నికల్లో విజయావకాశాలకు సంబంధించి ఏయే అంశాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు?

టిడిపి, వైసిపి  అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు. 2014 తర్వాత రాష్ట్రాభివృద్ధి జరిగిందంటే కేంద్ర నిధులతో మాత్రమే. టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో అరాచకం, అసమర్థత తప్ప చెప్పుకోవడానికి ఏమీలేదు. ఇక్కడ ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బిజెపికి మాత్రమే ఉంది. అదే చెప్పి మేం ప్రజల్లోకి వెళ్తున్నాం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని మీరు అంటున్నారు. ప్రజలు మిమ్మలను తిరస్కరించే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది కదా? 

 10 సంవత్సరాల్లో 11 ఇన్‌స్టిట్యూషన్స్‌ ఇవ్వాలని పార్లమెంటులో బిల్లు పెట్టారు. కానీ కేంద్రప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 39 ఇన్‌స్టిట్యూషన్స్‌ ఇచ్చింది. ఇవన్నీ చేసినప్పుడు సాధ్యపడేదాన్ని ఆపాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రత్యేక హోదాతో వచ్చే ఆర్థిక అంశాలన్నీ ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజు.. నరేంద్రమోదీ, బిజెపికి తప్ప ఏ పార్టీకి ఓటు వేయరు.

వైసిపి  అధినేత జగన్‌, కేసీఆర్‌తో కలిసి ప్రత్యేక హోదా సాధిస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమంటారు?

ఏ పార్టీ విధానాలు ఆ పార్టీకి ఉంటాయి. అంతేగానీ పార్టీలను విమర్శించకూడదు. మేం దీన్ని పరిగణనలోకి తీసుకోం. దీనిపై నేను కామెంట్‌ చేయను.

బిజెపికి  రాష్ట్రంలో ఒక్క సీటు వచ్చినా రూ.10 లక్షలు ఇస్తానని కుటుంబరావు అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ డిపాజిట్లు తెచ్చుకుంటే 15లక్షలు ఇస్తామని సవాల్‌ విసురుతున్నారు ?

రాష్ట్ర ముఖ్యమంత్రికి, కుటుంబరావుకి నేను కూడా ఛాలెంజ్‌ విసురుతున్నా. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ముఖ్యమంత్రి ఎంతెంత అప్పులు చేశారు. ఏ ముఖ్యమంత్రి ఓడీల మీద బతికారో చెప్పమనండి.

వైసిపి కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే.. అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్‌ కమిషన్‌ను కేంద్రం ప్రభావితం చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ?

ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఎలక్షన్‌ కమిషన్‌ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది.

ఇక్కడి పోలీసులు ప్రభుత్వానికి సహాయం చేస్తున్నాయన్నప్పుడు.. కేంద్రంలో ఉన్న సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయనడంలో తప్పేముంది.?

కేంద్ర సంస్థలు వారి వాహనాల్లో డబ్బులు తీసుకొని వచ్చి బిజెపి  కార్యకర్తలకు ఏమీ పంచడం లేదు కదా! ఐటీ దాడులు, ఈడీ దాడులు చేస్తే తప్పా?

నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి.?

నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ప్రజలు నా వల్ల ఇబ్బంది పడలేదు. నేను ఎక్కడైనా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాను. అందువల్ల విజయంపై ధీమాగా ఉన్నా.

రాష్ట్రంలో బిజెపి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? 

ఈ ఎన్నికల్లో బిజెపి ఒక ప్రధానమైన పాత్ర కచ్చితంగా పోషిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు బిజెపితోనే జరుగుతుందనే పరిస్థితికి మాత్రం ఎదగగలం అని నమ్ముతున్నాను.