కాంగ్రెస్ నా రక్తం తాగాలనుకుంటోంది

జన్ ఆశీర్వాద్ యాత్ర సందర్భంగా తన రథం కొందరు రాళ్లు రువ్విన ఘటన పట్ల  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతూ ఆ పార్టీ రక్తదాహంతో ఉందని, తన రక్తం కోరుకుంటోందని ఆరోపించారు.

సిద్ధాంతాల ఘర్షణ తప్పిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని విస్మయం వ్యక్తం చేసారు. అన్ని పార్టీల వారూ తమ సిద్ధాంతాలపై వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటని, అయితే రాళ్లు రువ్వుకోవడం మాత్రం ఎన్నడూ జరగలేదని చెప్పారు.

కాంగ్రెస్ అధినాయకత్వంపైనా చౌహాన్ విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్‌ను ఏ డైరెక్షన్‌లో తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, సీఎం రథయాత్రపై దాడి ఘటనకు సంబంధించి ఇంతవరకూ 9 మందిని అరెస్టు చేసినట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. అరెస్టయిన వారంతా కాంగ్రెస్‌కు చెందిన వారేనని చెప్పారు. సీఎంపై రాళ్లదాడి దురదృష్టకరమే కాకుండా సిగ్గుచేటని విమర్శించారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని మండిపడ్డారు.