చంద్రబాబు ఓటమి ఖాయం.. అమిత్ షా స్పష్టం

ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల స్ఫష్టమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని, ఆయన ఓటమి ఖాయం అని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. టిడిపి  ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సంగతిని గుర్తించి నాటకాలు ఆడి సానుభూతి సంపాదించుకోవడానికి  ఎన్డీయే నుంచి చంద్రబాబు వేరుపడ్డారని ఆరోపించారు.  దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ గాలి బలంగా వీస్తోందని, ప్రస్తుత సార్వత్రిక సమరంలో బిజెపి 2014కి మించిన స్థాయిలో సీట్లను గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

దేశంలో కప్పదాటు రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే అని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ఇంటర్వ్యూ లోని భాగాలు :

మీరు మిత్రపక్షాలతో సత్సంబంధాలు కొనసాగించలేదన్న ఆరోపణలున్నాయి. అందుకు ఉదాహరణ టిడిపి  

చంద్రబాబుతో గొడవలో మా ప్రమేయం లేదు. అంశాల ఆధారంగానూ అది జరగలేదు. అయన పూర్తి అవినీతి ప్రభుత్వాన్ని నడపడంవల్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. దాన్ని ఎదుర్కొనేందుకు ముఖం చాలక ఒక సెంటిమెంట్‌ ఎగదోసి మాతో గొడవపడి బయటకు వెళ్లారు. ఆ వ్యూహం ఆయన్ను కాపాడుతుందని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు ఓటమి ఖాయం. వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు. ఇక ఆర్‌ఎల్‌ఎస్‌పీ విషయం అంటారా వారు సామర్థ్యానికి మించి టికెట్లు అడిగారు. దాంతోపాటు నీతీశ్‌కుమార్‌ ఎన్డీయేలో చేరడం వారికి అసంతృప్తి కలిగించింది.  

చంద్రబాబు ఓటమి ఖాయం అంటున్నారు కదా? అక్కడ ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు?  

అది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిర్ణయించాలి. ఆయనపై మాత్రం స్పష్టమైన ప్రజావ్యతిరేకత ఉంది.  

ఆంధ్రప్రదేశ్‌లో మీ విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయి?  

 అవసరమైతే జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తీసుకుంటారా?  

మాకు ఎవరి మద్దతు తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి మెజార్టీ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు 13వ ఆర్థికసంఘం సమయంలో రూ.1.17 లక్షల కోట్లు లభించేవి. 14వ ఆర్థికసంఘం కాలంలో రూ.2.44 లక్షల కోట్లు ఇచ్చాం. ఈ అయిదేళ్లలో వివిధ పథకాల కింద ఆ రాష్ట్రానికి రూ.5.56 లక్షల కోట్లు ఇచ్చాం. పదేళ్లలో చేయాల్సిన 14 అంశాల్లో 11 అంశాలు ఇప్పటికే పూర్తిచేశాం. 20 జాతీయ సంస్థలు ఇచ్చాం. 11 విద్యాసంస్థలు ప్రారంభించాం. మౌలికవసతులకు చాలా నిధులు ఇచ్చాం. మా పథకాలను చంద్రబాబు సరిగా అమలుచేసి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఉండేదికాదు. 

అక్కడ జరుగుతున్న భారీ అవినీతిని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగదన్నది వాస్తవం. విభజన చట్టంలో లేని అంశాలుకూడా చాలా చేశాం. ప్రత్యేకహోదాతో సమానమైన సాయం చేయడానికి అంగీకరించాం. ఆ విషయాన్ని చంద్రబాబు శాసనసభ వేదికగా అభినందించారు కూడా. అనంతరం టిడిపి  ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సంగతిని గుర్తించి.. ప్రత్యేకప్యాకేజీ సాయం అందుకోవడానికి బదులు నాటకాలు ఆడి సానుభూతి సంపాదించుకోవడానికి మానుంచి వేరుపడ్డారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు.

 చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు. ప్రత్యేకప్యాకేజీ ప్రతిపాదనలుకూడా రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎవరు చంద్రబాబును ఓడిస్తారన్న దిశలో వెళుతున్నాయి. ఏపీ ప్రజల ఓటింగ్‌ సరళికూడా ఆ దిశలోనే వెళుతోంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మేం మంచి పనితీరు కనబరుస్తాం అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోకూడా మా ఓట్ల శాతం పెరుగుతుంది. మంచి పనితీరు కనబరుస్తాం. కొన్ని సీట్లుకూడా గెలుచుకోవచ్చు.  

రాజధానికోసం రూ.1,500 కోట్లు ఏం సరిపోతాయన్న ప్రశ్న ఉంది కదా?

అది రూ.1,500 కోట్లకే పరిమితంకాలేదు. రాజధాని పనులు జరిగేకొద్దీ దశలవారీగా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ, పనులే ముందుకు జరగలేదు. సింగపూర్‌ చేస్తా... అది చేస్తా... ఇది చేస్తా అంటూ ఫొటోలు తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అవివేకులను చేయడం మినహా అక్కడ ఏమీ జరగలేదు.  

బీహార్ లో ఒక కూటమి తరపున ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ తో మీరు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేశారు !

ఇలాంటి విచ్ఛిన్న రాజకీయాల పితామహుడు చంద్రబాబే. ఆయన తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. తర్వాత మామ దగ్గరకు వెళ్లారు. ఆయన్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఎన్డీయేలోకి వచ్చారు. వాజ్‌పేయీ సర్కారు ఓడిపోయిన వెంటనే దాన్నుంచి వైదొలగారు. మోదీ గాలి ఉన్నప్పుడు ఆయన వెంట వచ్చారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి బయటికెళ్లారు. ఏపీ, తెలంగాణల్లో కప్పదాటు రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే. 

బిహార్‌ విషయానికొస్తే నీతీశ్‌ మా పాత మిత్రుడు. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ నేతలపై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని పదవి నుంచి తొలగించేంత వరకూ ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దానిపై ఆ రెండు పార్టీలు స్పందించలేదు. అందుకే ఆయన కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే ఆయన మాతో కలిసి వచ్చారు.  

ప్రస్తుతం దేశంలో ఎలాంటి గాలీ లేదని, ఎన్నికలు వాస్తవ సమస్యల ఆధారంగా జరగబోతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కదా

నేను ఈశాన్య భారతం నుంచి కన్యాకుమారి వరకు, బిహార్‌ నుంచి గుజరాత్‌ వరకు దేశం మొత్తం తిరిగాను. ఎన్నికలకు ముందే 134 జిల్లాల్లో పర్యటించాను. మరోసారి మోదీని ప్రధానిగా చేయాలన్న ఉత్సాహం ప్రజలందరిలో కనిపిస్తోంది. ప్రజల మనోభావాన్ని బట్టి చూస్తే మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. ఎన్నికల తేదీలు దగ్గరపడే కొద్దీ ఈ గాలి మరింత పెరుగుతుంది.  ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే భాజపా 2014 కంటే ఎక్కువ సీట్లు సాధించి పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భాగస్వామ్య పక్షాలతో కలిపి మా బలాన్ని పెంచుకోవడమే లక్ష్యం.