కారు టీఆర్‌ఎస్‌ దే.. స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కుటుంబ అభివృద్ధి తప్ప రాష్ట్రాభివృద్ధి వారికి పట్టదని.. మూసీకి ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని మండిపడుతూ ఏప్రిల్‌ 11న టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలని పిలుపిచ్చారు. 

 హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగిస్తూ  ప్రజల అభివృద్ధి గురించి మజ్లిస్‌ పట్టించుకోదని, పాతబస్తీలో మెట్రో లైను వేస్తామంటే వారు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మజ్లిస్‌తో సావాసం వల్ల టీఆర్‌ఎస్‌ కూడా పాతబస్తీ ప్రజల్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. కారు  టీఆర్‌ఎస్‌  దే అయినా.. స్టీరింగ్‌ మాత్రం మజ్లిస్‌ చేతుల్లోనే ఉందని ఆరోపించారు. 

 "అభివృద్ధిలో బాటలో ఎంఐఎం స్పీడ్‌ బ్రేకర్‌గా మారింది‌. పాతబస్తీలో మెట్రో వేస్తామంటే మజ్లిస్‌ అడ్డుకుంది. ఎంఐఎంకు అభివృద్ధి అంటేనే నచ్చదు. మజ్లిస్‌కు రాత్రి కూడా మోదీనే గుర్తొస్తారు. ఎంఐఎం లాంటి వాళ్లు ఉండడం వల్ల టీఆర్‌ఎస్‌ కారు.. పనికిరాని కారుగా మారుతుంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లయిపోతారంట. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉంది. మజ్లిస్‌తో దోస్తీ టీఆర్‌ఎస్ కారును పంక్చర్‌ చేస్తుంది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ధైర్యంగా తీసుకొచ్చాంఅని మోదీ దుయ్యబట్టారు. 

‘‘బాంబులతో దద్ధరిల్లే దేశం కావాలా? ప్రశాంతంగా ఉన్న ఇప్పటి తరహా భారత్‌ కావాలో తేల్చుకోవాలి. ఈ చౌకీదార్‌ మీకు రక్షణ కల్పిస్తారా లేదా మీరే ఆలోచించండి." అని ప్రశ్నించారు.  కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారని చెబుతూ  ఇలాంటి డిమాండ్‌ ప్రజలకు అంగీకారమేనా? అని అడిగారు. కశ్మీర్‌ కోరుతున్న ఈ డిమాండ్‌కు కాంగ్రెసే జవాబు ఇవ్వాలి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలన్న డిమాండ్‌కు మహాకూటమి మద్దతిస్తుందా? అని నిలదీశారు. 

ఈవిషయంపై బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎందుకు గట్టిగా స్పందించరు?  అని ప్రశ్నించారు. ఏపీలోని యూటర్న్‌ బాబు ఫరూక్‌ అబ్దుల్లాతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తారని ఎద్దేవా చేస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో జట్టు కట్టిన కాంగ్రెస్‌, టిడిపి, జనతాదళ్‌, తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీ, చంద్రబాబు, దేవెగౌడ ఆయా రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. మోదీ ఉన్నంత కాలం ఇలాంటి విభజనవాదుల ఆటలు సాగవని హెచ్చరించారు.

ప్రజలకు బిజెపితో ఉన్న సంబంధం సభ్యత్వాల సంఖ్యతో చెప్పేది కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘నా వెంట నడుస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు. రాజకీయం కోసం దళితులను వాడుకుంటున్నారు. నిరంతరం నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చా. ఈ ఐదేళ్లలో మధ్యతరగతి ప్రజలకు విద్య, ఆరోగ్యం, రుణాలు అందుబాటులోకి వచ్చాయి"అని పేర్కొన్నారు.

 గతంలో మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకొనేందుకు ఇబ్బంది పడేవారని తెలుపుతూ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు మేం కృషిచేశామని,  ఆదాయ పన్ను పరిమితి పెంపు నేటినుంచి అమలులోకి వచ్చిందని వెల్లడించారు. రూ.5లక్షల లోపు ఉన్నవారు పన్ను కట్టాల్సిన పనిలేదని అంటూ ఈ ఐదేళ్లలో ప్రజలపై కొత్తగా ఒక్క పన్ను కూడా విధించలేదని గుర్తు చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తే ఇప్పుడు దక్కిన ఊరట పోతుందని హెచ్చయిరాలు.  అత్యవసర పరిస్థితి సమయంలో దేశభక్తులను ఇందిరా గాంధీ జైల్లో పెట్టారని దుయ్యబట్టారు. 

భాగ్యనగరం యువశక్తికి ప్రేరణలా నిలుస్తోందని పేర్కొంటూ  ప్రపంచంలోనే అత్యంత అధికంగా అంకుర సంస్థలు హైదరాబాద్‌లో వెలుస్తున్నాయని కొనియాడారు. అంకుర సంస్థలకు మరింతగా చేయూతనిచ్చేందుకు ఎన్డీయే కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ముద్ర పథకం ద్వారా లక్షలాది చిరు వ్యాపారులకు రుణాలిచ్చామని చెబుతూ తెలంగాణకు చెందిన అనేక మంది దీని కింద రుణాలు పొందారని పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పటి చౌకీదార్‌ ప్రభుత్వం మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.