అవును టాయిలెట్ చౌకీదార్ నే!

తనను ‘‘టాయిలెట్ల చౌకీదార్‌’’గా పేర్కొంటూ ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ తనదైన శైలిలో స్పందించారు. తాను ‘‘టాయిలెట్ చౌకీదార్’’నేననీ... అలా ఉంటూ దేశంలోని కోట్లాది మంది మహిళలను కాపాడుతున్నానని కౌంటర్ విసిరారు. 

వార్ధాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ‘‘నేను మరుగుదొడ్ల కాపలాదారుడిని. అలా చెప్పుకునేందుకు గర్విస్తున్నాను. టాయిలెట్లకు చౌకీదార్‌గా ఉంటూ కోట్లాది మంది భారత మహిళల గౌరవాన్ని నేను కాపాడుతున్నాను..’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘టాయిలెట్ల చౌకీదార్’’ అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం పారిశుధ్య కార్మికులను అవమానించడమేనని దుయ్యబట్టారు. 

పనిలో పనిగా మహారాష్ట్రలోని కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఒక రైతుగా ఉండి కూడా మహారాష్ట్రలోని రైతులను మర్చిపోయారని విమర్శించారు.

‘‘ ప్రజలకు భారతదేశంలోని హీరో కావాలా లేక పాకిస్తాన్‌లో హీరోలుగా ఉంటున్నవారు కావాలా? మీకు ఆధారాలు కావాలా లేక ఆధారాలతో గర్వించడం కావాలా? ఇదే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఆజాద్ మైదానంలోని షాహీద్ స్మారకాన్ని తొక్కించలేదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.