చంద్రబాబుకు ఏటిఎంగా మారిన పోలవరం ప్రాజెక్ట్

పోలవరం ప్రాజెక్ట్‌ ను ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకొంటున్నరని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రి ఆర్ట్స్‌ కళశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు మంజూరు చేశామని, ప్రాజెక్ట్‌ అంచనాలను పెంచి చంద్రబాబు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. గత 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మోదీ ఆరోపించారు. 

తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని గుర్తు చేస్తూ ఈ ప్రాజెక్టు అంచనాలను టిడిపి ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందని దుయ్యబట్టారు. ఈవిధంగా అంచనాలు పెంచుకోవడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్‌బాబు పేర్లు మారుస్తున్నారని ప్రధాని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. యూటర్న్‌ బాబు హెరిటేజ్‌ సంస్థ కోసమే పనిచేస్తున్నారని, యూటర్న్‌ బాబు పరిస్థితి బాహుబలి సినిమాలో భల్లాలదేవలా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ యోజనపైనా స్టిక్కర్‌ పెట్టారన్నారు.  ఆయన పాలన అధర్మంగా, అన్యాయంగా ఉందని ధ్వజమెత్తురు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మోదీ విమర్శించారు. 

ఆయన మాటలను ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ నమ్మరని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు నీతిగా జీవిస్తారని.. చంద్రబాబు మాత్రం వారిని మోసం చేస్తుంటారని దుయ్యబట్టారు. యూటర్న్‌ బాబు చేస్తుంది నమ్మకద్రోహం, అవినీతని, ప్రజల డేటాను యూటర్న్‌ బాబు దొంగలించారని మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

సేవా మిత్ర యాప్‌ ద్వారా ప్రజలకు టిడిపి  సేవ చేయడం లేదని ఆరోపించారు. ‘సేవ లేదు.. మిత్రులు కాదు.. ప్రజల వివరాలు దొంగిలించారు’ అని ప్రధాని ఆరోపించారు. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌లకు ప్రజల సంక్షేమం పట్టదని పేర్కొంటూ  వాళ్ల కుటుంబాల వికాసం కోసమే ఆ పార్టీలు పనిచేస్తుంటాయని దుయ్యబట్టారు. ఉగ్రవాదులను వాళ్ల గడ్డపైకి వెళ్లి మరీ దాడి చేశామని.. కొందరు నేతలు మాత్రం పొరుగు దేశానికి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు.  

 అగ్రవర్ణపేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించింది తామేనని చెబుతూ ఆంధ్రుల అభివృద్ధే బీజేపీ లక్ష్యమని భరోసా ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో ఏమాత్రం పన్నులు పెంచలేదని చెబుతూ కోట్లాది మంది చెల్లిస్తున్న పన్నుల వల్లే విద్య, మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రధాని తెలిపారు. రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా చారిత్రక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఆ నిర్ణయం నేటినుంచి అమల్లోకి వచ్చిందని చెప్పారు. 

 ‘‘మహాభారతానికి జన్మనిచ్చిన రాజమహేంద్రికి ప్రణామాలు. ఆదికవి నన్నయ, కందుకూరి వీరేశలింగం, దామెర్ల రామారావులాంటి ప్రజాసేవకులు పుట్టిన నగరం ఇది’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో దేశ ప్రగతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 

కాకినాడను స్మార్ట్‌సిటీగా చేయడమే కాకుండా, గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాజెక్టులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పన్ను పరిధిని పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా ప్రలకు కోరుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తుతూ తాము దానిపై కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

 రైతుల మేలు కోసం కేంద్రం అనేక పథకాలు చేపట్టిందని చెబుతూ ధాన్యంతో కలిపి 22 రకాల పంటలకు గిట్టుబాటు ధరను రెండున్నర రెట్లు పెంచిందని మోదీ గుర్తు చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అంటూ వారికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇప్పటికే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక బడ్జెట్‌ కూడా ఏర్పాటు చేశామని.. కిసాన్‌ కార్డుల తరహాలో మత్స్యకారులకూ క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. .