ఒడిశా సీఎంకు ఒడియా రాదు: అమిత్‌షా

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌‌‌కు ఇప్పటికీ ఒడియాలో మాట్లాడటం రాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఎద్దేవా చేశారు. 19 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఒడియాను నవీన్ పట్నాయక్ నేర్చుకోలేదంటూ విమర్శించారు. 

మీ భాషలో మీతో మాట్లాడే ప్రధానిని ఎన్నుకోండని, నవీన్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరునూరైనా మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని ఒడిశాలోని పార్లఖెముండి నియోజకవర్గంలో సోమవారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేసారు. 

బిజూ జనతా దళ్ చీఫ్ నవీన్ బాబుకు వెస్ట్ ఒడిశా, సెంట్రల్ ఒడిశా అంటే సవతి తల్లి ప్రేమ అని, దీనికి ఓటుతో ప్రజలు సమాధానమిచ్చే తరుణం ఇదేనని అమిత్‌షా చెప్పారు. 19 ఏళ్ల నవీన్ పాలన అవినీతిమయమని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అవినీతికి కళ్లెం వేయాలంటే అటు కేంద్రంలో, ఇటు ఒడిశాలో బీజేపీకి ఓటు వేయాలని, రెండింజన్ల ప్రభుత్వం అవసరమని అమిత్‌షా పేర్కొన్నారు.