హిందూ సంస్కృతిని దారుణంగా అవమానించిన కాంగ్రెస్

వేల సంవత్సరాల చరిత్రతో వర్థిల్లుతున్న హిందూ సంస్కృతిని కాంగ్రెస్ దారుణంగా అవమానించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్‌సీపీ పొత్తుపై మండిపడ్డారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాద్‌ నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ  ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదజాలాన్ని రూపొందించిన కాంగ్రెస్ 5,000 సంవత్సరాల నుంచి ఉన్న హిందూ సంస్కృతిని అవమానించిందని ధ్వజమెత్తారు. హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే దమ్మును కాంగ్రెస్ కోల్పోయిందని దుయ్యబట్టారు. మెజారిటీ ప్రజలు మైనారిటీలో ఉన్న స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుందని ఎద్దేవా చేశారు. 

‘‘హిందూ ఉగ్రవాదం అనే పదజాలానికి వాళ్ళు జన్మనిచ్చారు. 5,000 ఏళ్ళనాటి సంస్కృతిని అవమానించారు. హిందువులకు ఉగ్రవాదులనే పేరును తగిలించి పాపం చేశారు. ఇప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నారు. అందుకే వాళ్ళు మెజారిటీ ప్రజలు మైనారిటీలో ఉన్న స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు’’ అని మోదీ విమర్శించారు. 

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీ అధికారంలో ఉన్నపుడు కుంభకర్ణుడిని తలపించేదని మోదీ ఎద్దేవా చేశారు. ఆరు నెలలు నిద్రపోయి, ఒక రోజు మేలుకుని, ప్రజల సొమ్మును భోంచేసి, తిరిగి పడుకునేవారని ధ్వజమెత్తారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మన దేశంలో అనుభవంగల నాయకుల్లో ఒకరు అని, ఆయనకు గాలి ఎటు వీస్తోందో తెలుసునని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తిరస్కరించారని చెప్పారు. ఆయన మేనల్లుళ్ళు కూడా ఆయనను పక్కనబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.