బ్యాంకులకు దడ పుట్టిస్తున్న విద్యుత్ కాంట్రాక్టులు

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా విద్యుత్‌ రంగంకు చెందిన ప్రైవేటు కాంట్రాక్టుదారులు అంటే బ్యాంకులకు దడ పుట్టుకోస్తున్నది. వారికి రుణాలు ఇవ్వడం అంటే ఆ మొత్తాలపై ఆశలు వాదులు కోవడంగా భావిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులను తీవ్ర సంక్షోభంలోకి నేట్టివేస్తున్న మొండి బకాయిలలో అత్యధికం వీరికి ఇచ్చినవే కావడం గమనార్హం.

ప్రభుత్వం నుండి తమకు కాంట్రాక్టులు దక్కిన పత్రాలు చూపి భారీగా రుణాలు పొందటం, తీరా ఆయా ప్రాజెక్ట్ లను పూర్తి చేయక పోవడం, నిర్మాణ ఖర్చులు పెరిగాయని అదనంగా రుణాల కోసం డిమాండ్ చేయడం, ఉప కాంట్రాక్టు దారులకు ఆయా పనులను అప్పగించి రెండు వైపులా డబ్బులు దండుకొని బ్యాంకులను మాత్రం నిండా ముంచి వేస్తున్నాయి.

ఈ విధంగా తీసుకున్న రుణాలలో రాజకీయ, అధికార వర్గాలకు సహితం ప్రమేయం ఉంటూ ఉండడంతో బ్యాంకులు సహితం వారి పట్ల కటినంగా వ్యవహరించలేక పోతున్నాయి. అందుకనే ఇకనుండి ఇటువంటి కాంట్రాక్టుదారులకు అసలు రుణాలు ఇవ్వవద్దని భావిస్తున్నాయి.

మొదటగా విద్యుత్ రంగానికి బ్యాంకులు రుణసాయం నిలిపివేయాలని ప్రభుత్వరంగ అగ్రగామి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భావిస్తున్నది. గత దశాబ్దకాలంలో ఈ రంగానికి మంజూరు చేసిన రుణాల్లో అధిక భాగం మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారడం వంటి భయానక అనుభవమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఆర్‌బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.1.7 లక్షల కోట్ల ఎన్‌పీఏలను దివాలా చర్యల కోసం బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు  (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణాలను నిలిపివేయాల్సి రావచ్చని ఎస్‌బీఐ ఎండీ దినేష్‌కుమార్‌ ఖరా స్పష్టం చేసారు. అయితే రహదారుల ప్రాజెక్ట్ లు మాత్రం కొనతమేరకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి.   రిస్క్‌ నివారణను సరైన చర్యలు తీసుకుంటే అన్ని రంగాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే, విద్యుత్‌ రంగానికి సంబంధించి ఇంధన సరఫరా ఒప్పందాలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరంగా సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఫిబ్రవరి 12 నాటి ఆర్‌బీఐ ఎన్‌పీఏల సత్వర గుర్తింపు ఉత్తర్వుల కారణంగా బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని మరో ఎండి పీకే గుప్తా తెలిపారు. విద్యుత్‌ ప్రాజెక్టుల ఎన్‌పీఏలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించితే సహజంగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దుకు దారితీస్తుందని, అది బ్యాంకులను బలహీనపరుస్తుందని చెప్పారు. బ్యాంకులకు మరింత సమయం ఇస్తే ఎన్‌సీఎల్‌టీకి వెళ్లకుండా పరిష్కార ప్రణాళిక కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు.