4 తరాలుగా పేదరికంపై అదే వాగ్దానం.. మోదీ ఎద్దేవా

పేదరిక నిర్మూలన గురించి 4 తరాలుగా అదే వాగ్దానం చేస్తున్నారని, కానీ ఇంతవరకూ ఏమీ జరుగలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కనీస ఆదాయ భరోసా హామీపై, గాంధీ కుటుంబం పై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు సంధించారు. పేదరిక నిర్మూలనపై హామీలిస్తున్న వారి గత చరిత్రను మొదటిసారి ఓటు వేసే యువత పరిశీలించాలని సూచించారు. 

ఆదివారం జరిగిన మై బీ చౌకీదార్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దేశంలోని 500 ప్రదేశాల్లోని బీజేపీ కార్యకర్తలు, నిపుణులు, వాచ్‌మన్లు, వ్యాపారులు, రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగంతో దేశ సామర్థ్యాన్ని చాటిన ఏ-శక్తి ప్రయోగానికి, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆ ప్రయోగం గురించి ప్రకటించడాన్ని విపక్షాలు విమర్శించడంపై మోదీ మండిపడ్డారు. 

ఏశాట్ పరీక్షను అమెరికా, రష్యా, చైనా బహిరంగంగానే నిర్వహించాయి. మనమెందుకు దాచి పెట్టాలి? అని ప్రశ్నించారు. బాలాకోట్‌పై భద్రతా దళాలు దాడులు చేశాయని, తాను కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయాలని తానే నిర్ణయించానని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎక్కడి నుంచి నడుపుతున్నారో.. అక్కడి నుంచే ఆట ఆడాలని భావించానని చెప్పారు. 
బాలాకోట్ దాడుల తరువాత పాకిస్థాన్ చిక్కుల్లో పడిందని చెబుతూ భారత వాయుసేన వైమానిక దాడులు చేసిందంటే .. బాలాకోట్‌లో ఉగ్రశిబిరాలున్నట్టు అంగీకరించాలి. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంప్‌లు లేవని తొలి నుంచి చెప్తున్నందున ఇప్పుడు వాటిని దాచిపెట్టేందుకే దాడులు జరిగిన ప్రదేశానికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదని దుయ్యబట్టారు. 

తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నందునే భారత్ మాటను ప్రపంచం ఆలకించిందని, అందువల్ల ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని ప్రధాని కోరారు. పేదరిక నిర్మూలనపై కాంగ్రెస్ వాగ్దానాలను ఎత్తిచూపుతూ.. పేదరికంపై ఆందోళన వ్యక్తం చేసిన దేశ తొలి ప్రధాని (నెహ్రూ).. దానిని నిర్మూలిస్తానన్నారు. ఆయన కుమార్తె (ఇందిర) మరింత ముందుకెళ్లి గరీభీ హఠావో అని నినాదాలిచ్చారు. ఆమె కొడుకు (రాజీవ్) ఆ నినాదంతోపాటు దేశంలో పేదరికాన్నీ విస్తరించారు. 

తరువాత ఆయన భార్య (సోనియా) 10 ఏండ్లు రిమోట్ కంట్రోల్‌తో పాలించి నప్పుడూ పేదరికం మరింత పెంచారు. ఇప్పు డు ఆమె కుమారుడు (రాహుల్) కూడా అదే చేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. దేశాన్ని లూటీ చేసిన వారు ప్రతి పైసా తిరిగి చెల్లించాల్సిందే. ఎగవేతదారుల ఆస్తి దేశంలో ఏ మూలన ఉన్నా జప్తు చేస్తాం అని స్పష్టం చేశారు.