ప్రధాని ప్రచారం విశేషాలతో `నమో టివి' ప్రారంభించిన బీజేపీ

మరో పది రోజులలో లోక్ సభ ఎన్నికల మొదటి దశకు ఎన్నికలు జరుగబోతుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా జరుపుతున్న ఎన్నికల ప్రచారం విశేషాలను ఎప్పటికప్పుడు తెలియ చెప్పేందుకు వీలుగా "నమో టివి" ఛానల్ ను బిజెపి ఆవిష్కరించింది. అన్ని ప్రధాన డి టి హెచ్ వేదికలపై ఈ టివి ఛానల్ లభిస్తుందని పార్టీ ఒక ట్వీట్ లో తెలిపింది. 

"ఎన్నికల విశేషాలను అందుకోండి... ప్రజాస్వామ్య నృత్యాన్ని తిలకించండి.. నమో టివితో నమో అని మరో సారి అనండి" అంటూ పిలుపిచ్చింది. 

నమో టివి కార్యక్రమాలను తిలకించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలను ఆహ్వనించారు. ఆదివారం జరుగనున్న #నమోభీచౌకీదార్ కార్యక్రమాన్ని కూడా ఈ టివి ద్వారా చూడవచ్చని తెలిపారు. 

"చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది చౌకీదారులతో సమాలోచనలు జరుపుతున్నాను. మీరు తప్పకుకండా తిలకించవలసిన సమాలోచన ఇది. నమోయాప్ లేదా నమో టివి ద్వారా చుడండి" అంటూ పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ టివి ఛానల్ లో ప్రధాని కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం తిలకించి వచ్చు. ఈ ఛానల్ లోగో పై మోదీ ఫోటో ఉంది. ప్రధాని కార్యక్రమాల ప్రత్యక్ష  ప్రసారాలతో పాటు లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాన ప్రసంగాల  సంకలనాలు కూడా ప్రసారం చేస్తారు. 

ప్రధాని ప్రసంగాలలోని ప్రధాన  అంశాలతో స్క్రోల్ లను కూడా చూస్తూ ఉండవచ్చు. ఐదేళ్ల ప్రధాని పాలనలో అమలు జరిపిన వివిధ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ప్రకటనలను కూడా చూడవచ్చు. 

నమో యాప్ పేరుతో ఇప్పటికే ప్రధాని మోదీకి అధికార ఆప్ ఉంది. ఈ యాప్ ద్వారా తాజా సమాచారం, విశేషాలు తెలపడంతో పాటు  ప్రధాని నేరుగా సందేశాలు, సమాధానాలు ఇస్తూ ఉంటారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోదీ ఒక టివి ఛానల్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు.

 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐపిటివి ఛానల్ ను  ప్రారంభించారు. దానికి "వన్డే గుజరాత్" అని పేరు పెట్టారు. అయితే ఎన్నికల కమీషన్ అభ్యంతరం తెలపడంతో ఆగిపోయింది.