సైకిల్‌ పూర్తిగా కనుమరుగుకావడం ఖాయం

 త్వరలో సైకిల్‌ పూర్తిగా కనుమ రుగుకావడం ఖాయమని  బిజెపి నేత జివిఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు.  బాబు, రాహుల్‌ గాంధీకి ఓటమి భయం వెంటాడుతోందని చెబుతూ ఎన్డీఏకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భరోసా వ్యక్తం చేశారు.  బీజేపీపై దుష్ప్రచారం తమకు పాజిటివ్‌గా మారుతోందని చెప్పారు. 

టీడీపీలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు తయారయ్యారని, నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని జీవీఎల్‌ అన్నారు. చంద్రబాబు, రాహుల్‌, మమతకి ఓటమి భయం పట్టుకుందని, రాహుల్‌ అందుకే రెండు స్థానాల నుంచి పోటీచేస్తున్నారని జీవీఎల్‌ విమర్శించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన 44 స్థానాలు కూడా ఈసారి రావని జోస్యం చెప్పారు. చంద్రబాబు, రాహుల్‌, మమత, కేజ్రీవాల్‌ వ్యక్తిగత ప్రతిష్ట కోల్పోయారని దయ్యబట్టారు. బహిరంగ చర్చకు రావాలని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చంద్రబాబుకి సవాల్‌ విసిరితే.. ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు. 

‘ఇవి సైకిల్ కనుమరుగయ్యే ఎన్నికలు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. మళ్లీ తెలుగుదేశం పార్టీ నిలబడలేదు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కల్యాణ్‌గా మారాడు. పెదబాబు, చినబాబులను పల్లెత్తు మాట అనడం లేదు. మంగళగిరి వైపు కన్నెత్తి చూడటం లేదు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా పవన్ నటిస్తున్నారు ’ అని జివిఎల్ ధ్వజమెత్తారు. 

చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోవడంతో జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్‌ ఆక్షేపించారు.  

గంటల తరబడి సోది ముచ్చట్లు చెబుతున్న చంద్రబాబు ప్రజలకు ఏం  చేశారో మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న సీఎం  స్టిక్కర్ బాబుగా మిగిలిపోయారని చురకలంటించారు. 12 లక్షల ఆవాజ్ యోజన ఇళ్ళు ఇస్తే.. అవన్నీ తామే ఇచ్చామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

స్పెషల్ ప్యాకేజీ కింద 90 శాతం కేంద్రం నిధులిస్తే.. అవినీతికి  పాల్పడ్డారు . ఏపీకి ఇచ్చిన నిధుల గురించి ప్రధాని మోదీ చెబుతుంటే సహించలేక పోతున్నారని చెబుతూ కేంద్రం మాట్లాడి కియా ప్రాజెక్టును దేశానికి తీసుకువచ్చిందని స్పష్టం చేశారు