ఒత్తిడిని తట్టుకునే సత్తా మా ప్రభుత్వానికి ఉంది : మోదీ

తన ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం తక్షణ నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతూ ఒత్తిడిని తట్టుకునే సత్తా తన ప్రభుత్వానికి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలను జాప్యం చేయడం నేరపూరిత నిర్లక్ష్యమని ధ్వజమెత్తారు. ఓ టివి వార్త ఛానల్ ను ప్రారంభిస్తూ తన ప్రభుత్వం నిబద్ధతనే నమ్ముతుందని, అయోమయాన్ని కాదని తెలిపారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంలోని పెద్దలు దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేశారని ప్రధాని ఆరోపించారు. దేశ సామర్థ్యాలను కూడా సరైన రీతిలో వినియోగించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. యాంటీ శాటిలైట్ మిసైల్‌ను తయారు చేసే సత్తా భారత దేశానికి ఉన్నప్పటికీ, దానిని తయారు చేసి, పరీక్షించే రాజకీయ దృఢ నిశ్చయం గత ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

పని చేయాలని చెప్తూ ప్రజలు యూపీయేకి అధికారాన్ని ఇచ్చారని, అయితే యూపీయే ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతకు తగినట్లుగా వ్యవహరించడంలో విఫలమైందని ప్రధాని విమర్శించించారు. ప్రస్తుత ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలన్నీ తప్పుడువేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నాయని, బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై వాయు సేన దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాలు సాక్ష్యాలు కావాలంటున్నాయని మంది పడ్డారు. ‘‘రుజువు కావాలని ఎందుకు అంటున్నారు? పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం ఎందుకు?’’ అని ప్రశ్నించారు.

నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంలో గత ప్రభుత్వం జాప్యం చేసిందని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తిరిగి భారత దేశానికి తీసుకు రావడానికి యూపీయే పాలకులు ప్రయత్నించలేదని దుయ్యబట్టారు. అవినీతిని నిరోధించేందుకు వ్యవస్థను కట్టుదిట్టం చేసే బాధ్యత వారికి (గత పాలకులకు) లేదా? అని ప్రశ్నించారు.

తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మారిషస్‌-భారత్ మధ్య ఒప్పందాన్ని తన ప్రభుత్వం మరింత పటిష్టపరిచిందని, స్విట్జర్లాండ్ (భారతీయులు దాచుకున్న నల్లధనంపై) ఈ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందని తెలిపారు.